what-ys-rajashekar-reddy-done-to-kapu-communityరెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంతో పోల్చి చూడడం… గత కొన్ని సంవత్సరాలుగా జగన్ అవలంభిస్తున్న రాజకీయ నీతి. అయితే ప్రస్తుతం ఏపీని అట్టుడికిస్తున్న ‘కాపు కుల’ ప్రస్తావనలపై వైయస్ హయం గురించి జగన్ పల్లెత్తు మాట కూడా మాట్లాడడం లేదు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలమే ఏపీకి నిజమైన ‘స్వర్ణయుగం’గా అభివర్ణించే జగన్, మరి కాపుల విషయంలో తన తండ్రిని ఎందుకు విస్మరించినట్లు..? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు ఏమీ చేయలేదా? తనను నమ్ముకున్న వారికి, తన సామజిక వర్గానికి చెందిన వారికి ప్రయోజనాలు చేకూర్చడం తప్ప, ఇతర సామాజిక వర్గాలకు వైఎస్సార్ చేసిందేమీ లేదన్న ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. అయితే తాజా రాజకీయ పరిణామాలతో మళ్ళీ వైఎస్ ప్రస్తావన తేవాల్సి వచ్చిందని పరిశీలకులు వ్యక్తపరుస్తున్నారు. చంద్రబాబు చెప్తున్నట్లుగా… గత ప్రభుత్వాలు విస్మరించిన అంశాన్ని తానూ తెరపైకి తీసుకువచ్చి, కాపులకు న్యాయం చేయాలని చూస్తుంటే తన పైనే బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలే నిజమైనవా? వీటికి సమాధానం కాలమే చెప్పాలి!

వైయస్ హయంలో ఏమీ జరగలేదు కాబట్టే… ‘అదేదో’ చందంగా… జగన్ కు కేవలం వంగవీటి మోహన రంగా హత్య ఉదంతం మాత్రమే దొరికిందని, అందుకనే కాపులను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలోనూ రంగా హత్య అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ కాపు వర్గాలను భావోద్వేగాలకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న భావాలు. మరి వైయస్ ‘స్వర్ణయుగం’లో కాపులు లేకపోవడం విస్తుగొలిపే విషయమే! అసలు విశేషమేమిటంటే… అప్పటి అంధ్రప్రదేశ్ లోనూ ఎక్కువ ప్రజానీకం కాపు కులస్తులే. మరి వారికే ప్రయోజనం లేకపోతే మరి ఆ ‘స్వర్ణయుగానికి’ అర్ధం ఏమిటని ఎవరికైనా ప్రశ్నలు వస్తే… దానికి నిలువెత్తు సమాధానమే ‘యువనేత’ జగన్ మోహన్ రెడ్డి. ఆనాటి ‘స్వర్ణ’యుగం గురించి వైయస్ వారసుడిగా జగన్ కు తెలిసినంతగా మరొకరికి తెలియదుగా..!