kidari sarveswara rao joins TDఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ పార్టీ టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో 16 మంది టీడీపీ తీర్థం పుచ్చుకోగా, మరికొందరు లైన్ లో ఉన్నారు. వైసీపీకి ఎమ్మెల్యేల జంపింగ్ లతో సదరు నియోజకవర్గాల్లో పార్టీ జెండా పట్టుకునే వారే కరువయ్యారు. జిల్లాల వారీగా ఖాళీ అవుతూ వస్తున్న వైసీపీ ఖాతాలో విశాఖ జిల్లా కూడా చేరబోతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

విశాఖ జిల్లాలో ఇప్పటికే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఉన్న వారితో విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిలెక్కేయడంతో, అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిపోయింది. తాజాగా ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలోనూ వైసీపీ ఖాళీ కానుంది.

నేడు విశాఖ పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆ నియోజకవర్గ వైసీపీ నేతలంతా టీడీపీలో చేరనున్నారు. భీమిలి మునిసిపాలిటి మాజీ చైర్మన్ శైలేందర్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ స్థానిక నేతలంతా సైకిలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆనందపురంలో భారీ ఏర్పాట్లు జరగడంతో విశాఖ జిల్లా కూడా టిడిపి వశం కావడానికి మరెంతో కాలం దూరం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.