KTR-Andhra-comments‘ఆంధ్రా – తెలంగాణా’ అన్న వివక్షతోనే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుంది. అయితే, రాష్ట్ర విభజన జరిగి, రెండు ప్రభుత్వాలు ఏర్పడి ఎవరి పాలన వారు ప్రశాంతంగా చేసుకుంటున్న సమయంలో కూడా ఇంకా ‘ఆంధ్రా – తెలంగాణా’ అన్న వివక్ష చూపించడం అవివేకంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన సమయంలో మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసాయి.

తెలంగాణ రాష్ట్రంలో ‘టీఆర్ఎస్’ పార్టీ ‘తిరుగులేని రాజకీయ శక్తి’గా ఎదిగి, ఏకైక పార్టీగా నిలిచే రోజు ఎంతో దూరంలో లేదని, రాష్ట్రం నుంచి ఓ ఆంధ్రా పార్టీ మొత్తం మాయమైపోయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం ఎంపీ పొంగులేటితో పాటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేరికతో వైకాపాకు ఒక్క శాసనసభ్యుడు కూడా మిగల్లేదని, ఇక మరో ఆంధ్రా పార్టీ తెలుగుదేశానికి ఇదే గతి పట్టే రోజు తొందర్లోనే రానుందని, ఆ పార్టీ సైతం మాయం కానుందని కేటీఆర్ విమర్శల వర్షం గుప్పించారు.

పార్టీల నేతల జంపింగ్ వ్యవహారాలు రాజకీయాల్లో షరామామూలే. దానికి అనుగుణంగా విమర్శల్లో భాగంగా ఎలాంటి ఆరోపణలైనా చేసుకోవడం వర్తమాన రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం. అయితే విభజన జరిగిన తర్వాత కూడా ఇంకా ప్రాంతీయ విభేదాలు సృష్టించే విధంగా వ్యాఖ్యానించడం కేవలం పబ్బం గడుపుకోవడానికేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఓ పక్కన బాధ్యత గల మంత్రి పదవి లో ఉన్న కేటీఆర్ నోట నుండి అస్సలు రాకూడని మాటగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.