trs-created-history-in-ghmc-electionsచరిత్రలో ఏ పార్టీలకు ఇవ్వని విధంగా 100కు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన జంట నగరాల ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్ననని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని, విజయం సాధించిన వారందరికీ అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.

ఇంత పెద్ద విజయం నాయకులకు గర్వం కాకూడదని, అహంకారంతో పని చేయవద్దని పిలుపునిచ్చారు. ఇప్పుడు అణకువ కావాలని, టీఆర్ఎస్ నేతలపై ప్రజలు భారీ బాధ్యతను మోపారని గుర్తు చేసారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు కట్టించి తీరుతామని, రాబోయే బడ్జెట్ లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధులు కేటాయిస్తామని ఈ దిశగా అధికారులకు సూచనలు ఇచ్చామని అన్నారు.

పేదల ఎజెండానే టీఆర్ఎస్ ఎజెండాగా కొనసాగుతుందని, హైదరాబాద్ లో పెద్ద రిజర్వాయర్లు రెండు ఏర్పాటు చేసి మంచి నీటి సమస్య అన్నది లేకుండా చేస్తామని, అలాగే హైదరాబాద్ లో కనురెప్ప పాటు విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తామని, స్కైవేలు, మల్టీలెవల్ ఫ్లై ఓవర్లు, ట్రాఫిక్ సమస్యలు ఏవీ లేకుండా చూస్తామని ఇందులో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేసారు.

కింగ్ కోఠీ ఆసుపత్రిని వెయ్యి పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతూ, మరో రెండు వెయ్యి పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని, ఖుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఒకటి, చాంద్రాయణ గుట్ట ప్రాంతంలో మరోకటి ఏర్పాటు చేస్తామని, ఈ ఆసుపత్రుల్లో అపోలో, యశోధ, కిమ్స్ వంటి ఆసుపత్రుల్లో కన్నా అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, ఇదంతా ఏడాది కాలంలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్ ను ట్రూలీ గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని, గ్రేటర్ లో అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యతను గెలిచిన సభ్యులంతా తీసుకోవాలని, ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామని, ఏడాది కాలంలో అన్నీ చిత్తశుద్ధితో అమలు చేసి చూపించి అభివృద్దిలో చరిత్ర సృష్టిస్తామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు గ్రేటర్ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి.