Trivikram Srinivasమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం “అ…ఆ…” విడుదలకు సర్వహంగులు సిద్ధమయ్యాయి. ట్రైలర్లో చూపించిన విధంగానే సెన్సార్ బోర్డు నుండి ‘క్లీన్ యు’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాను జూన్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులలోనూ ‘అ… ఆ…’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ధియేటిరికల్ ట్రైలర్ కు వీక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడంతో… సినిమాను కూడా మునుపెన్నడూ లేనంతగా నితిన్ కెరీర్ లో అత్యంత భారీగా విడుదల చేస్తున్నారు. అలాగే ఓవర్సీస్ ప్రేక్షకుల్లో త్రివిక్రమ్ కున్న క్రేజ్ రీత్యా, అక్కడ కూడా భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణాలలో ప్రేక్షకులు ఎలాంటి ఫలితాలను అందించినా… త్రివిక్రమ్ సినిమాలను ఓవర్సీస్ ప్రేక్షకులు మాత్రం ‘బ్రహ్మరధం’ పడతారు. దీంతో హీరో నితిన్ కు ఈ అంశం ప్లస్ పాయింట్ గా మారి, మరో మార్కెట్ ను ఏర్పరచుకోవడానికి అవకాశం దక్కింది.

ఇటీవల విడుదలైన భారీ చిత్రం ‘బ్రహ్మోత్సవం’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో ఒక మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు. కుటుంబం మొత్తం చూడదగ్గ త్రివిక్రమ్ సినిమా అయితే అంతకు మించినది మరొకటి ఉండదు. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్యూలో నిల్చుని టికెట్లు తీసుకుంటారు. అంత డిమాండ్ ఉన్న త్రివిక్రమ్ లేటెస్ట్ ‘సెల్యూలాయిడ్’ను వీక్షించాలంటే మరో 7 రోజులు ఆగాల్సిందే.