mahanaduతెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మరియు పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదిన దినోత్సవాల సందర్భంలో ‘మహానాడు’ను జరుపుకోవడం ఆనవాయితీ. పార్టీ అంతర్గత పండుగలా జరుపుకునే మహానాడు మూడు రోజులలో పార్టీ వర్గాలకు పసందైన విందు భోజనం తదితర అంశాలన్నీ సర్వసాధారణమే. అలాగే, పార్టీ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తదితర అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తాయి. ప్రతి ‘మహానాడు’లో ఇవన్నీ రొటీన్ అంశాలే.

వీటికి తోడు గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ – హరికృష్ణల వివాదం కూడా ‘మహానాడు’కు హైలైట్ అవుతూ వస్తోంది. కానీ, ఈ ఏడాది మాత్రం ఎలాంటి కుటుంబ వివాదాలు గానీ, పార్టీ పరమైన వివాదాలు గానీ లేకుండా మహానాడు జరుగుతోంది. అలాగే గతంలో ‘మహానాడు’లకు విభిన్నంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు, వైసీపీ అధినేత జగన్ కుటుంబంపై దండెత్తడం విశేషం.

‘ఎనీ సెంటర్… సింగిల్ ఫ్యామిలీ… ఏపీలో అరాచకం…’ అనే టైటిల్ కు సార్ధకత చేసే విధంగా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మొదలైన ‘రక్తచరిత్ర’ను ఉదహరిస్తూ… టిడిపి కార్యకర్తలు ఒక్కొక్కరిగా హత్యలు గావించబడిన వైనం, అలాగే తెలుగుదేశం పార్టీ కీలక నేత పరిటాల రవి హత్యను గుర్తు చేస్తూ చేసిన ప్రసంగం టిడిపి నాయకులలో నూతన ఉత్తేజాన్ని నింపింది.

ఆనాడు పరిటాల రవి హత్యకు ప్రణాళిక వేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్న చంద్రబాబు… ఇటీవల కాపు ఉద్యమ సందర్భంగా చెలరేగిన తుని ఘటన వెనుక కూడా కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయంటూ పరోక్షంగా జగన్ ను దుయ్యబట్టారు. నేర చరిత్ర ఉన్న నాయకులు ప్రజలను భయబ్రాంతులకు గురయ్యేలా చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధికి కుంటుపడుతున్నారని, రాష్ట్రంలో ఎలాంటి అరాచక శక్తి జరిగినా, దాని వెనుక వైఎస్సార్ కుటుంబ సభ్యుల హస్తం ఉంటుందని, ‘మహానాడు’ వేదికగా ధ్వజమెత్తారు.

సాధారణంగా జగన్ ను ఏకరువు పెట్టడం సహజమే. అయితే ‘మహానాడు’ వంటి వేదికలపై పార్టీకి సంబంధించిన చర్చలు మాత్రమే జరుపుతారు. బహుశా అలాంటివి చేసి చేసి కొత్తదనం లేదని భావించారో ఏమో గానీ, సరికొత్తగా జగన్ పై ‘స్వరం’ పెంచారు. అయితే ఈ భీకర ‘స్వరం’ పరిటాల రవి హత్య కేసు తిరగతోడే వరకు వెళ్ళదు కదా..! ఇటీవల పరిటాల సునీత తెలిపిన వివరాల మేరకు పరిటాల రవి హత్య కేసులో న్యాయం జరగలేదన్న అభిప్రాయం చంద్రబాబులో కూడా ఉందని తెలిపారు. ఇదే భావాలను చంద్రబాబు వ్యక్తపరిచిన నేపధ్యంలో పరిటాల రవి కేసు వెలుగులోకి వస్తే ఏమవుతుందో..?