Sivaji on special statusకేంద్రమంత్రి హరిభాయ్ చౌదరి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీపై ఆంధ్రప్రదేశ్ బిజెపి యువమోర్చా తీవ్ర స్థాయిలో మండిపడింది. శివాజీ వ్యాఖ్యలను ఉదాహరిస్తూ ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని విజయవాడ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసారు. దీంతో తాజాగా మరోసారి మీడియా ద్వారా స్పందించిన శివాజీ… తనే కాదు, పవన్ కళ్యాణ్ కూడా దేశద్రోహేనా…? అంటూ ప్రశ్నించారు.

‘ప్రత్యేక హోదా’పై పవన్ చేసిన ట్వీట్ పై ఓ మీడియా సంస్థ చేపట్టిన చర్చలో భాగంగా తన అభిప్రాయాలను చెప్పిన శివాజీ… పవన్ చెప్పిన ఖచ్చితమైన ఆభిప్రాయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ… ప్రత్యేక హోదాపై పవన్ మరింత చొరవ చూపాలని, ఒక బహిరంగ సభ పెట్టి, పవన్ రోడ్డుపైకి వస్తే… ఏపీ ప్రత్యేక హోదా అంశం నాలుగు నెలల్లో పరిష్కారం అవుతుందని అభిప్రాయ పడ్డారు.

ఏపీ ‘ప్రత్యేక హోదా’పై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రశ్నించడం వలనే తనపై దేశద్రోహం కేసు పెడితే… పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు గనుక, బిజెపి దృష్టిలో పవన్ కూడా దేశద్రోహేనా? అంటూ బిజెపి తీరుపై మండిపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో నేడు శివాజీ ఎలా స్పందించినా… ప్రత్యేక హోదా సాధన సమాఖ్య ఏర్పరిచిన తొలి రోజు నుండి పవన్ రోడ్డు మీదకు రావాలని కోరుతున్నారు.

పవన్ ఉద్యమిస్తే ‘ప్రత్యేక హోదా’ అంశం పరిష్కార దశకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శివాజీ మాదిరే ‘జనసేన’ అభిమాన గణం కూడా పవన్ కళ్యాణ్ స్థామినాపై పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. మరి పవన్ కు ఆ సత్తా ఉందంటారా? ఆ బాధ్యతను పవన్ నెత్తికెత్తుకుంటారా? కాలమే సమాధానం చెప్పాలి.