Siachen survivor Lance Naik Hanumanthappaలాన్స్ నాయక్ హనుమంతప్ప. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. సియాచిన్ మంచు తుపానులో చిక్కుకుని 9 మంది మృత్యువాత పడగా, 6 రోజుల తరువాత హనుమంతప్ప మృత్యుంజయుడిగా తిరిగొచ్చిన వైనం అందరినీ అబ్బురపరిచింది. గల్లంతైన వారి కోసం సైనికాధికారులు చేస్తున్న గాలింపులో ఊపిరి బిగబట్టి ప్రాణాలు నిలుపుకున్న హనుమంతప్ప దర్శనమిచ్చారు. అయితే ఇది ఎలా సాధ్యమైంది? మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య చిక్కుకున్న హనుమంతప్ప ఈ 6 రోజులు చేసిందేమిటి? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. వాస్తవ పరిస్థితులను ఒక్కసారి విశ్లేషించుకుంటే…

సియాచిన్ వంటి ప్రాంతంలో విధులు నిర్వర్తించే వారందరికీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ఏం చేయాలనే దానిపై ముందుగానే శిక్షణ ఉంటుంది. మంచు చరియలు విరిగిపడ్డా, మంచు వర్షం భారీగా కురుస్తున్నా, కనీసం తల వరకూ పైన నిలుపుతూ, మంచులో ఈత కొడుతూ ఉండాలన్నది ప్రధాన సూత్రం. కానీ హనుమంతప్ప విషయంలో అలా జరగలేదు, దాదాపుగా 25 అడుగుల లోతుకు కూరుకుపోయాడు.

అయితే అదృష్టవశాత్తూ ఇక్కడ సహజ సిద్ధంగా గాలి లోనికి ప్రవేశించడంతో అతని ప్రాణాలు నిలిచాయి. అలాగే అతను వేసుకున్న దుస్తులు శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సహకరించి హైపోథెర్మియా సోకకుండా చూశాయి. దీంతో పాటు సాధ్యమైనంతగా మూత్ర విసర్జన చేయకపోవడం కూడా అతని శరీరంలో వేడిని నిలిపి వుంచింది. ఇది కూడా ఆయన ప్రాణాలు నిలువడం వెనుక అసలు కధ.

మరి ఇదే ప్రమాదంలో మిగిలిన 9 మందీ చనిపోయి హనుమంతప్ప ఒక్కడే బ్రతికి ఉన్నాడంటే… పెద్దలు చెప్పినట్లుగా అతనికి ఈ భూమిపై ఇంకా నూకలు చెల్లివున్నాయని చెప్పుకోవాలి. మృత్యుంజయుడు కాబట్టే, రక్తాన్ని సైతం గడ్డ కట్టించే చలిలో ఆరు రోజులు తిండి లేకున్నా బతికాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ సైనికుడి ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతోందని వైద్యులు వెల్లడించారు.

అన్ని సౌకర్యాలతో ఫ్యాన్ క్రింద కూర్చుని సేద తీరుతూ నాలుగు రోజులు ఆమరణ దీక్ష చేసిన ఒక రాజకీయ నాయకుడి కోసం మన వారు తాపత్రయ పడుతుంటారు. అవసరమనుకుంటే మరికొన్ని ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తుంటారు. అది దేశభక్తికి – రాజకీయ నాయకుడికి ప్రజలు మరియు మీడియా ఇచ్చే ప్రాధాన్యత!