mahesh-may-month-sentimentశ్రీకాంత్ అడ్డాల – ప్రిన్స్ మహేష్ బాబుల “బ్రహ్మోత్సవం” ఈ రేంజ్ లో ఫలితాలు రావడానికి కొన్ని అంశాలు బలంగా కలిసోచ్చినట్లు తెలుస్తోంది. సెంటిమెంట్స్ ను విపరీతంగా నమ్మే సినిమా ఇండస్ట్రీలో… బహుశా మే మాసంలో మరో మహేష్ బాబు మూవీ విడుదల కాకపోవచ్చు. ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో కలిపి మొత్తం మూడు సినిమాలు విడుదల కాగా, మొత్తం మూడు బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలను చవిచూసాయి. అంతకు మేలో విడుదలైన “నిజం, నాని” సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా మే మాసం మహేష్ బాబు అభిమానులకు ఇక నుండి దూరం కానుంది.

ఇక, మరో ప్రధానంగా సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన అంశం… బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ రంగప్రవేశం. గతేడాది విడుదలైన ‘బ్రూస్ లీ’ సినిమా షూటింగ్ సమయంలో, ఆ సెట్స్ కు వచ్చిన షారుక్, ‘బ్రహ్మోత్సవం’ సెట్స్ లోనూ సందడి చేసిన విషయం తెలిసిందే. ‘బ్రూస్ లీ’ ఎలాంటి బాంబును పేల్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా! ఇక అదే బాటలో ‘బ్రహ్మోత్సవం’ కూడా పయనిస్తోంది. దీంతో షారుక్ సెట్స్ కు వస్తున్నారంటే టాలీవుడ్ చిత్ర యూనిట్ లు ‘పేకప్’ చెప్పుకునే పరిస్థితి నెలకొంది.

అలాగే, ప్రిన్స్ మహేష్ బాబు – దర్శకులకు ఉన్న అనుబంధం. మహేష్ ను రెండోసారి దర్శకత్వం వహించిన దర్శకులలో ఇప్పటివరకు పూరీ జగన్నాధ్ మినహా మరే ఇతర దర్శకుడు హిట్ రేంజ్ సినిమాను అందించలేకపోయారు. గుణశేఖర్, త్రివిక్రమ్, శ్రీనువైట్ల వంటి ప్రఖ్యాత దర్శకుల జాబితా ఉండడం విశేషం. ఇలా ‘బ్రహ్మోత్సవం’ ఫలితం చుట్టూ సెంటిమెంట్స్ కమ్ముకున్నాయి. అయితే సరైన కధను ఎంపిక చేసుకోకుండా, ఇలా పరాజయాలను ‘సెంటిమెంట్స్’ పేరు చెప్పి తప్పించుకోవడం సినీ జనాలకు మామూలే కదా!