secrets behind rajamouli padma sri award“బాహుబలి” చిత్రం ద్వారా తెలుగు వాడి సత్తాను, కీర్తిప్రతిష్టతలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన రాజమౌళికి ‘పద్మశ్రీ’ పురస్కారం రావడం పట్ల అందరూ సంతోషించారు. అయితే, ఈ అవార్డును ఏ రాష్ట్రం సిఫారసు చేసిందో తెలిసి అభిమాన వర్గాలు అవాక్కవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణాలు మాత్రం రాజమౌళి పేరును ప్రతిపాదించలేదని స్వయంగా రాజమౌళినే ట్వీట్ చేసారు.

‘జక్కన్న’ పేరును ‘పద్మశ్రీ’ పురస్కారానికి ప్రతిపాదించింది కర్ణాటక రాష్ట్రమని తెలిసిన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలపై మండిపడుతున్నారు. మన వారిని మనమే గౌరవించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని మండిపడుతున్నారు. అయితే, గతేడాది ఏపీ ప్రభుత్వం సిఫారసు చేయగా, దానిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

కర్ణాటకలో పుట్టి ఏపీలో చదువుకుని, తమిళనాడులో పనిచేసి తెలంగాణా స్థిరపడ్డానని చెప్పిన రాజమౌళి వ్యాఖ్యలపై కూడా భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాయి. రాజమౌళికి వ్యతిరేకంగా ట్విట్టర్ ఖాతాలోనే ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

‘ఇది డైలాగ్ ఆఫ్ ది ఇయర్’ అని, ఆయన గొప్పగా నటిస్తున్నారని, ఓ యాక్టింగ్ స్కూల్ ను మొదలు పెట్టాలని, తెలుగు చిత్ర సీమను నమ్ముకుని ఇలా మాట్లాడుతారా? అని, ఇక మీరు మా ‘ఎస్ఎస్ఆర్’ కాదనిపిస్తోందని, మీకన్నా గొప్ప దర్శకుడైన శంకర్ కు ఇంతవరకూ గుర్తింపు లేదని, మీ అసహనం మాకు అసహనాన్ని కలిగిస్తోందని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్న ట్వీట్లూ వస్తున్నాయి.