Railway Minister Suresh Prabhu gives clarity over railway zone in APఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి ఏపీకి రైల్వే జోన్ ఇవ్వాల్సి ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీలో తెలిపారు. ఏపీకి రైల్వే జోన్ ఇవ్వాల్సి ఉంది కానీ, సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, అయితే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఏపీకి రైల్వే జోన్ డిమాండ్ ఐదు దశాబ్దాలుగా ఉందని అన్న సురేశ్ ప్రభు గారు, భువనేశ్వర్ కేంద్రంగా రైల్వే జోన్ ఉండడంతో రైల్వే అధికారులు విశాఖ రైల్వేజోన్ ను అంగీకరించడం లేదని తెలిపారు. భువనేశ్వర్ రైల్వే జోన్ కు రాయఘడ, అరకు లేన్ లు అధిక ఆదాయ మార్గాలుగా ఉన్నాయని, భిలాయ్, స్టీల్ ప్లాంట్ నుంచి ఇనుము ఎగుమతికి వాల్తేరు డివిజన్ ఎంతో కాలంగా విశేషమైన సేవలందిస్తోందని అన్నారు.

ఈ నేపథ్యంలో ఒడిశా రైల్వే జోన్ కి అధిక ఆదాయం అందించే విశాఖను కోల్పోవడం ఇష్టం లేక అభ్యంతరాలు వ్యక్తపరుస్తోందని వివరించారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే జోన్ కు విశాఖ, విజయవాడల వైపు నుండి వచ్చే ప్రయాణికులే ఆధారం కావడంతో, సికింద్రాబాద్ రైల్వే జోన్ కూడా విశాఖకు రైల్వే జోన్ ఇచ్చేందుకు సుముఖంగా లేదని తెలిపారు. సరకు, ప్రయాణికుల రవాణాలు విశాఖ రైల్వే జోన్ కు వెళ్తే, తమ ఆదాయాలకు గండి పడుతుందన్న నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ డిమాండ్ పైకి లేచిన ప్రతి సారి ‘సాంకేతిక కారణాలు’ అంటూ కారణం చూపుతూ జోన్ ను నిరాకరిస్తున్న ఎన్డీయే విధానం మరోసారి బహిర్గతమైంది.