qutbullapur mla vivek joining TRSఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలలో సగం మంది అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా, తాజాగా వెల్లడైన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు మిగతా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను కూడా ప్రభావితం చేసేలా కనపడుతున్నాయి. తాజా పొలిటికల్ వర్గాల సమాచారం మేరకు హైదరాబాద్, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ కూడా కారెక్కారు. ఈ విషయాన్ని కేసీఆర్ తనయురాలు కవిత ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సిఎం క్యాంప్ ఆఫీస్ లో వివేక్ గులాభీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఇటీవల ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కుత్భుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లన్నీ కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో, అభివృద్ధి నినాదంతో వివేక్ కూడా ‘గులాభీ’ జెండా పట్టుకున్నారు. వివేక్ కూడా పార్టీ మారడంతో హైదరాబాద్ లో టిడిపి ఎమ్మెల్యేల సంఖ్య కేవలం నాలుగుకే పరిమితమైంది. గత సార్వత్రిక ఎన్నికలలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలలో వివేక్ తో కలిపి ఆరుగురు “కారు”లో పయనిస్తున్నారు.

తెలంగాణాలో పార్టీ అంతకంతకూ కుచించుకుపోవడం పార్టీ కార్యకర్తలను, అభిమానులను కలచివేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో తీవ్ర నిరాశలో ఉన్న పార్టీ వర్గాలను ఇలాంటి జంపింగ్ జిలానీలు మరింతగా కృంగదీస్తున్నారు. దయనీయ పరిస్థితులలో ఉన్న తెలుగుదేశం పార్టీని భుజానకెత్తుకునే వారు ఎవరుంటారా? అన్న ఆశావహ దృక్పథంలో కార్యకర్తలు ఉన్నారు.