Black money in indiaకేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో ‘జనభాగస్వామ్యం’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజల నుండి సలహాలను, సూచనలను ఆహ్వానించింది. దాదాపు 6500 మంది పౌరులు పంపిన సలహాలలో కొన్ని మిక్కిలి ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం నిర్దేశించుకున్న నల్లధనాన్ని తిరిగి దేశానికి రప్పించడం గానీ, నివారణ చర్యలు గానీ ఆశించిన సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయి.

“దేశం మొత్తంలో ఉన్న కరెన్సీని రద్దు చేసి కొత్త కరెన్సీ విధానాన్ని ప్రవేశపెడితే, దేశంలో ఉన్న నల్లధనం మొత్తం బయటపడుతుందని” ఓ పౌరుడు సూచించిన సలహా ఆచరణకు సాధ్యమయ్యేదా? లేదా? అన్న విషయం పక్కన పెడితే నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఇలాంటి ఆలోచనల దిశగా అడుగులు వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సదరు సలహాను అనుసరిస్తే, ఖచ్చితంగా బ్లాక్ మనీ అంతా బ్యాంకులలో జమ కావాల్సి ఉంటుంది, తద్వారా నల్లధనాన్ని నివారించడంతో పాటు, గతంలో దాచిన బ్లాక్ మనీని కూడా వెలికి తీపించవచ్చు, లేదంటే అవి చిత్తు పేపర్లతో సమానంగా పరిగణించాల్సి ఉంటుంది. అయితే మన దేశంలో ఇలాంటి కార్యాలు నెరవేరే అవకాశం లేదన్నది జగమెరిగిన సత్యమే.

ఇదే మాదిరి గత కొన్ని సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్న మరో మార్గం ‘ప్లాస్టిక్ కరెన్సీ.’ ఎటువంటి నగదు లావాదేవీలు లేకుండా ప్రతి చిన్న విషయానికైనా కేవలం స్వైపింగ్ మెషీన్ల ద్వారా లావాదేవీలను కొనసాగించే మార్గం ప్రతిపాదనలో ఉంది. పరోక్షంగా ఇది సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని, దీని ద్వారా దొంగ నోట్ల సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటే, ఇలాంటి సూచనలకు, సలహాలకు కొదవుండదని, అయితే ఆ దిశగా చిత్తశుద్దితో విధి నిర్వహణ చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.