Pawan-Kalyan-SJ--Surya--Husharuఅభిమానుల గుండెల్లో ‘పవర్ స్టార్’గా చిరస్థాయిగా ముద్ర వేయించుకున్న ‘జనసేన’ అధినేత విలువలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తాడో తెలిసిన విషయమే. ఒక్క అతని వ్యక్తిగత విషయం వివాహంలో మినహాయిస్తే… పవన్ కు మన-తన, ధనిక-పేద, కుల-మత అన్న తేడాలు ఉండవన్న విషయం బహిర్గతమే. అయితే పవన్ కు ఎన్ని ఆదర్శ భావాలు ఉన్నాయో, అదే స్థాయిలో ‘అతి విశ్వాసం’ ఉందన్న విషయం చాలా సార్లు నిరూపణ అయ్యింది. తాజాగా మరొకసారి పవన్ చేసిన ట్వీట్ కూడా అలాంటి సంకేతాలనే ఇస్తోంది.

“సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం సీమాంధ్ర ఎంపీలను తన్ని – పార్లమెంట్ లోంచి బయటకు గెంటి – ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి – కాంగ్రెస్ పార్టీ ఒక ఘోరమైన తప్పు చేసింది. ఆ రోజు సీమంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మరిచిపోలేదు – మరిచిపోరు కూడా…! ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి, సీమాంధ్ర ప్రజల నమ్మకం మీద కొట్టి, బిజెపి కూడా అలాంటి తప్పు వైపే అడుగులు వేయకూడదని నేను కోరుకుంటున్నాను. ‘స్పెషల్ స్టేటస్’ గురించి ప్రజలు రోడ్లు మీదకొచ్చి ఉద్యమించే లోపే అధికార పార్టీ ఎంపిలు – ప్రతిపక్షాలను కూడా కలుపుకుని పార్లమెంట్ లో దీని మీద పోరాటం చేయాలని సీమంధ్ర ప్రజల తరపున నా విన్నపం…” అంటూ పవన్ ‘ప్రత్యేక హోదా’ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసారు.

పవన్ ట్వీట్ చూస్తుంటే… బిజెపిపై ఇంకా పూర్తి విశ్వాసం పెట్టుకున్నట్లు కనపడుతున్నారు. గత రెండు సంవత్సరాలలో ప్రధాని మోడీ మినహా బిజెపికి చెందిన మంత్రులంతా వివిధ సందర్భాలలో ప్రత్యేక హోదాపై ప్రకటనలు చేసారు. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అయితే బిల్లులో ఉన్న అంశాలను మాత్రమే అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు. వాటికి కొనసాగింపుగా తాజా ప్రకటన వచ్చింది తప్ప, ఇందులో ప్రత్యేకం ఏమీ లేదు. అయినప్పటికీ పవన్ ఇంకా బిజెపిపై నమ్మకాన్ని పెట్టుకోవడం రాజకీయంగా వేస్తున్న తప్పటడుగుకు నిదర్శనమా?

‘ప్రజారాజ్యం’ పెట్టిన సమయంలో తన సోదరుడు చిరంజీవిపై అతి విశ్వాసాన్ని ప్రదర్శించి, భంగపాటుకు గురైన పవన్ కళ్యాణ్, బిజెపి విషయంలోనూ అదే రకమైన అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పవన్ స్వరం పెంచాల్సిన సమయం ఆసన్నమైందని, ముఖ్యంగా త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేసిన నేపధ్యంలో పవన్ వ్యాఖ్యలు మిక్కిలి ప్రాధాన్యత సంతరించుకుంటాయని, దానికి తగిన విధంగా స్పందిస్తే ప్రజల ఆదరణ చూరగొన్నవారవుతారని విశ్లేషకులు చేస్తున్న సూచనలు.