Pawan Kalyan Speech Tirupati, Pawan Kalyan Emotional Speech Tirupati AP Special Status, Janasena Pawan Kalyan Speech Tirupati AP Special Statusఇదేదో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన పంచ్ కాదు… తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ వెలిబుచ్చిన ఆవేదనకు అర్ధం అది. గత రెండున్నర్ర సంవత్సరాలుగా సంయమనం పాటిస్తూ వస్తున్నది… చేత కాక కాదు, చావ లేక కాదు, పౌరుషం లేక అంత కంటే కాదు… అని స్పష్టంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన ‘ప్రత్యేక హోదా’పై ‘జనసేన’ అధినేత పూరించిన సమరశంఖం ఇది.

‘స్పెషల్ స్టేటస్’పై పోరాడే వ్యక్తిగా తానూ నిలబడతానని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా స్పష్టమైన భరోసా ఇచ్చారు. విల్లు నుండి వచ్చిన బాణం… నోట నుండి వచ్చిన మాట తిరిగి వెనక్కి రాదు… నేను కూడా వెనుకడుగు వేయను… ఆ స్థాయికే వస్తే… బరిలోకి దిగిన తర్వాత… “మెడ తెగి పడాలే గానీ, అడుగు మాత్రం వెనక్కి పడదు…” అంటూ ఉద్వేగ పూరితంగా గుచ్చి గుచ్చి మాట్లాడారు. ఈ ప్రసంగంతో ఇప్పటివరకు పవన్ పై ఉన్న విమర్శలన్నీ తొలగిపోయాయని చెప్పవచ్చు.

నిజానికి పవన్ మాట్లాడిన తీరు… వర్తమాన రాజకీయాలకు ‘తలంటు’ లాంటిది. సాధారణంగా రాజకీయ నాయకులు పాటించే విధానాలను తూర్పారబట్టిన పవన్, సరికొత్త రాజకీయాలకు నాంది పలికే విధంగా ప్రసంగించారు. మరోసారి తనపై కుల రాజకీయాలు చేస్తే… అరికాలు నుండి తల వరకు నషాళానికి ఎక్కుతుందని పరోక్షంగా ప్రత్యర్ధులకు హెచ్చరికలు జారీ చేసారు. అంటే ‘కాపుల ఉదంతం’లో పవన్ ఎందుకు స్పందించలేదు? అన్న వారికి సూటిగా సుత్తి లేకుండా తెలిపారు.

ప్రజా సమస్యలకు తానూ భజన చేస్తాను తప్ప మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలకు కాదు… తనకు ఎవరు అధికారంలో ఉన్నా ఒక్కటే… ప్రజలు సుభిక్షంగా ఉన్నంత వరకు తానూ ఎవరిని విమర్శించనని చెప్పిన పవన్, అధికార దాహం కోసం, పదవుల కోసం తానూ రాజకీయాల్లోకి రాలేదని మరోసారి స్పష్టం చేసారు. ఈ సమావేశంతో పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే సంకేతాలను అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందించారు. ఇదే ఉద్వేగంతో, ఇంతే ఉత్తేజంతో పవన్ గనుక తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తే… 33 సంవత్సరాల క్రితం ‘ఆత్మగౌరవం’ నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్ నమోదు చేసిన సంచలనం మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల కధనాలు ప్రారంభమయ్యాయి.