Pawan kalyan also cheated the people ?‘జనసేన’ అధినేత ఇటీవల షూటింగ్ కాన్సిల్ చేసుకుని హైదరాబాద్ కు ఎందుకు వచ్చారు? ‘కాపు ఐక్య గర్జన’ సందర్భంగా చెలరేగిన అల్లర్లపై స్పందిచడానికి కదా..! పవన్ చెప్పడం అలాగే చెప్పారు… పవన్ మాటలను విశ్వసించే ప్రజానీకం కూడా అదే నమ్మారు. అయితే తెరవెనుక వాస్తవం మరొకటుందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది.

“సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా షూటింగ్ కాన్సిల్ చేసుకుని హైదరాబాద్ కు వచ్చింది చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ వివాహ కార్యక్రమాల గురించి అని, కానీ ఈ విషయం చెప్పకుండా ప్రజలకు మాత్రం సమాజ సేవ తరహాలో తుని సంఘటనపై స్పందించడానికే వచ్చినట్లుగా చెప్పడాన్ని విని అవాక్కవ్వడం జనాల వంతవుతోంది. ఈ విషయంపై పవన్ కాస్త వివరణ ఇస్తే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

లేదంటే మెగా బ్రదర్ చిరంజీవి మాదిరే పవన్ పై కూడా బ్యాడ్ మార్క్ పడే అవకాశం ఉందని, ప్రజలలో ఒక్కసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ దానిని రాబట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదని, దానికి ఉదాహరణగా తన అన్నయ్య చిరు రాజకీయ జీవితమేనని, ఇప్పటికైనా పవన్ జాగ్రత్త పడాలని పరిశీలకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.

నిజానికి ఇప్పటివరకు పవన్ ఎలా మాట్లాడినా, ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించకపోయినా… ఎలాంటి నెగిటివ్ సంకేతాలు వెలువడలేదు. ఒకవేళ సదరు ఆంగ్ల పత్రికలో చెప్పిన విషయం నిజమని తేలితే మాత్రం పవన్ కూడా ఓ సాధారణ రాజకీయ నాయకుడి మాదిరి మారిపోయారనే విమర్శలకు తోడు, ఇక నుండి అతని మాటలకు కూడా ప్రాధాన్యత లేకుండా పోతుందని వెలువడుతున్న విశ్లేషణలు ఎన్నో ఎన్నెన్నో..!