Nathu Singhఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పేరుతో తొమ్మిదేళ్ల క్రితం రంగ ప్రవేశం చేసిన క్రికెట్ పండుగ… అనామకులను క్షణాల్లోనే స్టార్లను చేసేస్తోంది. గల్లీ క్రికెట్ లో ఆడిన వారిని కూడా వరల్డ్ క్రికెట్ లోకి లాగేస్తోంది. అంతేకాదు, దినసరి కూలీల ఇంట పుట్టిన ఆణిముత్యాలను క్షణాల్లో కోటీశ్వరులుగా మార్చేస్తోంది. అలాంటి ఓ అరుదైన ఘటన తాజా ఐపీఎల్ వేలంలో చోటు చేసుకుంది.

రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా జీవనం సాగిస్తున్న భరత్ సింగ్… తన కొడుకు నాథూ సింగ్ లోని ప్రతిభను గమనించి, క్రికెట్ ఆడే విధంగా ప్రోత్సహించాడు. తండ్రికి ఉన్న ఆర్ధిక పరిస్థితి రీత్యా దక్కిన అరకొర సౌకర్యాలతోనే నాథూ సింగ్ ఆడిన అతి కొద్ది మ్యాచ్ లలోనే సత్తా చాటాడు. ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్లు బెంబేలెత్తేలా గంటకు 160 మైళ్ల వేగంతో బంతులను వేసే నాథూ సింగ్ ఇప్పటిదాకా దేశవాళీలో 11 టీ 20 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు.

ఈ స్వల్ప కాలంలోనే అతడిలోని ప్రతిభను భారత్-ఏ కోచ్ రాహుల్ ద్రావిడ్ గుర్తించాడు. ఇంకేముంది, నిన్న జరిగిన ఐపీఎల్ వేలంలో నాథూ సింగ్ ను ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా 3.2 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. అంత ధర దక్కడంపై ఒక్కసారిగా నాథూ సింగే ఆశ్చర్యానికి గురయ్యాడు. “మా కుటుంబ ఆర్థిక కష్టాలు తీరినట్లే. ఈ డబ్బుతో ముందుగా నా తల్లిదండ్రులకు ఓ పెద్ద ఇంటిని కొనుగోలు చేస్తాను” అని నాథూ సింగ్ పేర్కొనగా, “ఎట్టకేలకు నా కొడుకు ప్రతిభకు ప్రతిఫలం దక్కింది” అని తండ్రి పులకించిపోయాడు.