Center creates one more hurdle to Polavaram!రెండు తెలుగు రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న ‘వివక్ష’ అంతకంతకూ పెరుగుతూ పోతుండడం విశేషం. రాష్ట్ర విభజనతో ఆర్థిక లోటులో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కు చిల్లిగవ్వ సహాయం చేసేందుకు కూడా సిద్ధంగా లేని కేంద్రం.., తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులనూ ప్రశ్నార్థకం చేసే దిశగా కీలక అడుగులు వేయడం, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని ప్రశ్నార్ధకం చేసే అంశమని రాజకీయ విశ్లేషకులు గగ్గోలు పెడుతున్నారు.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లను విడుదల చేస్తోంది. గ్రాంట్ అంటే సాయమే కాని, రుణం కాదు. అయితే ఇకపై సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చే నిధులను ‘గ్రాంట్’గా కాకుండా ‘రుణం’గా మంజూరు చేయాలని కేంద్రం ఆలోచనలు చేస్తోంది. రాష్ట్రాలకు విడుదల చేసే గ్రాంట్ల కోసం కేంద్రం…. జైకా, నాబార్డ్ తదితర సంస్థల నుంచి కేంద్రం అప్పులు తీసుకుంటోంది. తాను అప్పుగా తీసుకున్న నిధులను రాష్ట్రాలకు గ్రాంట్ గా ఇవ్వాల్సిన అవసరమేముందన్న భావనతో మోడీ సర్కారు కొత్త ప్రతిపాదనలను సిద్ధం అవుతోంది.

ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే… మిగిలిన రాష్ట్రాల పరిస్ధితి ఎలా ఉన్నా… తెలుగు రాష్ట్రాలు మాత్రం తీవ్రంగా నష్టపోనున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు అందే వెసులుబాటు రెండు రాష్ట్రాలకు మృగ్యం కానుంది. కేంద్రం ఇచ్చే నిధులను గ్రాంటుగా అయితే తీసుకోవడానికి సరేనంటున్న రాష్ట్రాలు, అప్పుగా తీసుకోవాలంటే మాత్రం ఆలోచించడం సహజమే.

ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ ల అంశంలోనే కాదు, జాతీయ హోదా దక్కిన ప్రాజెక్టుల విషయంలోనూ కేంద్రం ఇదే వైఖరితో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. జాతీయ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాలకు ఇచ్చే అప్పులో సగం తాను, మిగిలిన సగం రాష్ట్రం భరించేలా కేంద్రం ప్రతిపాదనలు చేస్తోంది. ఇదే జరిగితే… ఏపీలో కీలక ప్రాజెక్టుగా పరిగణిస్తున్న ‘పోలవరం’ నిర్మాణంపై పెను ప్రభావం పడనుంది. ఇప్పటికే ప్రత్యేక హోదాను దూరం చేసే యోచనలో ఉన్న ఏపీకి, పోలవరం నిర్మాణాన్ని కూడా ప్రశ్నార్ధకం చేసే ఆలోచనలు చేస్తోందా… అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి కేంద్రం యోచనను రాష్ట్రాలు ఏ మేరకు అడ్డుకుంటాయో లేదో చూడాలి.