Mumbai Indians Vs Pune Supergiants-IPL 2016కెప్టెన్ గా నిరాశాజనకమైన ఫలితాలను అందుకోవడంతో కెప్టెన్ ధోని ముందు వరుసలో ఉంటున్నారు. ఒక్క టీమిండియాకే కాదు, ఐపీఎల్ లో పూణే టీంకు సారధ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు ప్లే ఆఫ్స్ కు అర్హత కోల్పోయే పెను ప్రమాదంలో ఉన్నాడు. ఈ సీజన్లో ఐపీఎల్ నుండి వైదొలిగే తొలి జట్టుగా ధోని టీం ప్రస్తుతం ప్రమాదపు అంచులో ఉంది.

ఆడిన 8 మ్యాచ్ లలో ఆరు ఓటములు, రెండు విజయాలతో 4 పాయింట్లు కైవసం చేసుకున్న పూణే జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే మిగిలిన 7 మ్యాచ్ లలో 6 విజయాలు సొంతం చేసుకోవాలి. పూణే జట్టు ఆట తీరును పరిశీలిస్తున్న క్రీడా విశ్లేషకులు ఇన్ని విజయాలు వశం కావడం దాదాపు అసాధ్యంగానే చెప్తున్నారు. అదీగాక, పూణే జట్టులో అదరగొడుతున్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మణికట్టు గాయంతో ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. పూణే జట్టులో నిలకడగా రాణిస్తున్న ఏకైక బ్యాట్స్ మెన్ స్మిత్ కూడా వెళ్లిపోవడంతో పూణే జట్టు ఆశలు దాదాపుగా ఆవిరైనట్లే.

ఆదివారం నాడు జరిగిన ముంబై మ్యాచ్ లోనూ స్మిత్ క్రీజ్ లో ఉన్నంత సేపు మ్యాచ్ లో పూణే ఆధిక్యంలో కొనసాగింది. ఒక్కసారి స్మిత్ ఔటైన తర్వాత ముంబై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 200 వెళ్ళాల్సిన స్కోర్ ను కేవలం 159 పరుగులకే నిలువరించింది. దీంతో బ్యాటింగ్ పిచ్ పైన ఆ లక్ష్యాన్ని చేధించడం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు అవలీలగా మారింది. ముంబై ఇచ్చిన షాక్ తో ధోని జట్టు సభ్యుల బ్యాటింగ్ పై నిందలు వేయడం ప్రారంభించడం మరీ విడ్డూరం.