Mumbai Indians lost against Gujarat Lionsతప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చేతులెత్తిసిన ముంబై జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజేతులా జారవిడుచుకుంది. ప్రతి ఒక్కరూ అత్యుత్తమమైన ప్రతిభ చూపాల్సిన సమయంలో కెప్టెన్ నుండి మొదలుకొని బౌలింగ్ వరకు అంతా అభిమానులను తీవ్ర నిరాశ పరిచారు. ఈ సీజన్ ఆద్యంతం ఒక్క మ్యాచ్ మినహా మొదటి బ్యాటింగ్ చేయడంలో దారుణంగా విఫలమైన ముంబై జట్టు, మరోసారి అలాంటి ప్రతిభనే ప్రదర్శించింది. ఒత్తిడిలో ఉన్న బ్యాట్స్ మెన్లు ఎలాంటి షాట్లను ఆడతారో, సరిగ్గా అలాంటి షాట్లనే ఆడి ఒక్కొక్కరూ పెవిలియన్ బాట పట్టారు.

కెప్టెన్ రోహిత్ శర్మ 30, గుప్తిల్ 7, కృనాల్ పాండ్య 4 పరుగులు చేసి ఔటైన తరుణంలో వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగిన నితీష్ రానా 36 బంతుల్లో 70 పరుగులు చేయడంతో, కనీసం 172 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ నైనా చేయగలిగింది. రానాకు సహకారం అందించిన బట్లర్ 33 పరుగులు చేసి ఆకట్టుకోగా, పొల్లార్డ్, హార్దిక్ పాండ్య, హర్భజన్ సింగ్ చివర్లో షాట్ల కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ముంబై జట్టు బ్యాటింగ్ ను చూసి చిదరింపుకు గురవ్వడం వీక్షకుల వంతయ్యింది.

ఫుల్ ఫాంతో ఉన్న గుజరాత్ బ్యాట్స్ మెన్లకు ఈ లక్ష్యం స్వల్పమినదే అన్న విషయం మ్యాచ్ కు ముందే తెలియడంతో… ఆసక్తి తగ్గిపోయింది. అందుకు తగ్గట్లే మెక్కల్లం 27 బంతుల్లో 48, సురేశ్ రైనా 36 బంతుల్లో 58 పరుగులు చేసి మ్యాచ్ ను వన్ సైడ్ చేయగా, మిగిలిన కార్యాన్ని డ్వేన్ స్మిత్ 37, జడేజా 21 పరుగులు చేసి ముగించారు. కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి, 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో అగ్ర స్థానానికి చేరగా, ముంబై దాదాపుగా అవుట్ ఆఫ్ టోర్నీ అయ్యింది.

ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఐపీఎల్ లో సంచలనాలు నమోదు కావాల్సిందే. నేడు సన్ రైజర్స్ తో తలపడబోయే కోల్ కతా జట్టు భారీ తేడాతో ఓటమి పాలవ్వాల్సి ఉంటుంది. అలాగే, ఢిల్లీతో తలపడబోయే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు భారీ విజయం సాధిస్తే తప్ప ముంబైకు అవకాశాలు ఉండవు. రెండు మ్యాచ్ ల ఫలితాలపై ముంబై ఆశపడి, ప్లే ఆఫ్స్ కు చేరడమనేది అత్యాశ క్రిందికే వస్తుంది.