MLA roja fires on TDP‘రోజా’ అన్న పేరు వినడానికి ఎంత సౌమ్యంగా ఉంటుందో ‘రోజా’ పువ్వు చూడడానికి అంత అందంగానూ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏపీ టిడిపి నేతలకు ఈ పేరు కాస్త కఠినంగానూ, ఎంతో కర్ణకఠోరంగానూ వినబడుతోంది. దీనికి కారణం తెలుగుదేశం నేతలను టార్గెట్ చేస్తూ ఆమె గుప్పిస్తున్న చేస్తున్న విమర్శలే. అధికార పార్టీ నేతలను ఏ విధంగా విమర్శిస్తారో, ఆ పార్టీ అధినేత, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుపైన కూడా అంతే ఘాటు విమర్శలు చేసి మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతారు.

అయితే ఈ దూకుడు ఇప్పుడు కొత్తగా ప్రదర్శిస్తోంది కాదు. ఆమె రాజకీయ జీవితం మొదలు పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు కూడా రోజా ఇదే స్థాయిలో వ్యాఖ్యానించేవారు. కానీ ఈ “రోజా”కు ‘ముళ్ళు’ ఉంటాయని అపుడు గ్రహించలేకపోయారు. టిడిపి తరుపున రోజా రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోవడానికి సొంత పార్టీ వారే కారణమమని చాలాసార్లు రోజా బహిరంగంగానే వారిని వ్యాఖ్యానించారు. బహుశా అది మనసులో పెట్టుకుని టిడిపి వారిని మరింతగా గుచ్చుతున్నారేమోనన్న భావన వ్యక్తమవుతోంది.

తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే స్థాయిలో ప్రచారం పొందుతున్నాయి. “చంద్రబాబు నాయుడు పార్టీ ఓ మునిగిపోయే పడవ అని, అందులోకి ఎవరు పోయినా మరింత వేగంగా అది మునిగి పోతుందని, ఆ పార్టీలో ఉన్నవారంతా తామున్నది ‘పల్లకి’లో అని భావిస్తున్నారని, అది ‘పాడే’ అనే విషయం త్వరలోనే తెలుస్తుందని రోజా చేసిన ఘాటు విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన మరీ ఈ స్థాయిలో విరుచుకుపడక్కర్లేదన్న భావన రాజకీయ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి. అలాగే మరోవైపు అధికారంలో ఉన్నాం కదా అని టిడిపి వర్గాలు కూడా దురుసుగా ప్రవర్తించరాదని హితవు పలుకుతున్నారు. “ప్రశ్నించడం ప్రతిపక్షం విధి – సమాధానం చెప్పడం ప్రభుత్య భాధ్యత.” అయితే ఇదంతా ఒక సహ్రుద్భవ వాతావరణంలో జరిగినపుడే ప్రజలకు ప్రయోజనకారిగా ఉంటుంది.

విమర్శలు – ప్రతివిమర్శలు రాజకీయాలలో సహజమే. అంత మాత్రానా హద్దులు దాటి, విలువలు మరచి వ్యాఖ్యానించడం ఇరుపక్ష వర్గీయులు ఎంతవరకు సమంజసమో ఒక్కసారి పునరాలోచించుకోవాలి. రాజకీయ నాయకులపై చీదరించుకునే రోజు రాకుడదని ఓట్లు వేసిన ప్రజలు కోరుకుంటున్నారు. వ్యక్తులను చూసి కాకపోయినా, కనీసం వయసును, వారి పదవిని గౌరవమివడం కనీస బాధ్యతగా గుర్తించాలి. అప్పుడే భవిష్యత్తు తరం రాజకీయాల వైపు అడుగులు వేస్తారు.