KVP Private Bill, KVP Private Bill Voting, MP KVP Private Bill Voting, Congress MP KVP Private Bill Voting,  KVP Rajya Sabha Private Bill Voting, ఏపీ ‘ప్రత్యేక హోదా’ అంశంపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై గురువారం నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాజ్యసభలో చర్చ జరిపేందుకు అఖిలపక్ష సమావేశం నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై నిత్యమూ రాజ్యసభలో అట్టుడుకుతూ, వాయిదాలు పడటం మినహా మరే విధమైన కార్యకలాపాలూ సాగకపోవడంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అఖిలపక్ష నేతలను పిలిచి ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.

ఈ సందర్భంగా… బిల్లుపై చర్చకు మాత్రమే అనుమతిస్తామని బీజేపీ స్పష్టం చేయగా, దీనిపై ఓటింగ్ కు కూడా జరగాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఓటింగ్ విషయంపై స్పష్టత రానప్పటికీ, ‘ప్రత్యేక హోదా’ను పునర్విభజన చట్టంలో చేర్చాలన్న ఈ బిల్లుపై చర్చ జరగనున్న నేపధ్యంలో ఏ పార్టీ ఎలాంటి వైఖరిని అవలంభించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. దీంతో ఏపీ కేంద్రంగా మరోసారి ఢిల్లీ వర్గాల్లో రాజకీయం రంజుగా సాగుతోంది.

అయితే అసలు ఈ బిల్లు ప్రవేశపెట్టిన కేవీపీ ఈ అంశంపై తాజాగా స్పందించారు. “తాను రాజ్యసభలో పెట్టిన ప్రత్యేక బిల్లుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, తాను పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌ కు గురైనా బిల్లును ఉప‌సంహ‌రించుకోబోన‌ని” తేల్చిచెప్పారు. కేంద్రం నుంచి ఈ అంశంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స‌మాధానం చెబుతార‌ని కేవీపీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, కేవీపీ పెట్టిన హోదా బిల్లును ఉపసంహరించుకుంటామని కాంగ్రెస్ అగ్ర నేతలు చెప్పినట్లుగా ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.