KTR to decide Mayor candidate150 డివిజన్లకు గాను 99 డివిజన్లను కైవసం చేసుకుని ఎవరి మద్దతు లేకుండానే గ్రేటర్ పీఠంపై టీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసింది. దీంతో అందరి చూపులు మేయర్ అభ్యర్ధి ఎవరనే దానిపై పడ్డాయి. ఈ నెల 11న గ్రేటర్ మేయర్ అభ్యర్ధిని ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో మేయర్ పీఠాన్ని అధిరోహించే అభ్యర్థి ఎవరన్న చర్చకు తెర లేచింది.

పార్టీ టికెట్ పై విజయం సాధించిన పలువురు అభ్యర్థులు గ్రేటర్ పీఠం తమదేనని ఆశల పల్లకీలో ఊరేగుతున్నా… పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయమే కీలకం కానుంది. అంతేకాక ఈ విషయంలో కేటీఆర్ సూచించిన అభ్యర్థికే కేసీఆర్ మేయర్ పీఠం బాధ్యతలు అప్పగించడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పెద్ద ఎత్తున లాబీయింగ్ కార్యక్రమాల్లో ఆశావాహులు ఉన్నారని తెలుస్తోంది.

ఈ అభ్యర్థుల జాబితా చాంతాడంత ఉన్నా.., దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) కుమార్తె విజయారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఖైరతాబాదు డివిజన్ నుంచి బరిలోకి దిగిన విజయారెడ్డి 16,341 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాక నగరంలో బలమైన కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆమెకు పేరుంది. పీజేఆర్ కూతురుగానే కాక టీఆర్ఎస్ నేతగా ఆమె అభ్యర్థిత్వాన్ని ఎవరూ కాదనే పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. మరి కేసీఆర్ కూడా ఆమె అభ్యర్థిత్వానికే ఓటేస్తారా? లేక వేరే వారికి పగ్గాలు అప్పగిస్తారా? అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఈమె కాక, మేయర్ అభ్యర్థులుగా చర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేసిన బొంతు రామ్మోహన్, బంజారాహిల్స్ డివిజన్ నుంచి పోటీ చేసిన ఎంపీ కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిలు కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాదాపూర్ డివిజన్ నుంచి గెలిచిన జగదీశ్వర్‌ గౌడ్ పేరు కూడా ఓ దశలో వినిపించింది. అభ్యర్థి ఎవరైనప్పటికీ నిర్ణయం కేటీఆర్ చేతిలోనే ఉందని బలంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం.