Kohli Vs Warner2016 ఐపీఎల్ ఫైనల్స్ కు చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో తలపడబోయే జట్టు విషయంలో స్పష్టత వచ్చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒంటి చేత్తో జట్టును ఫైనల్స్ కు చేర్చాడు. కేవలం వార్నర్ వీరోచితమైన ఇన్నింగ్స్ వలనే హైదరాబాద్ జట్టు విజయం సాధించి ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 162 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను నమోదు చేసింది. ఒకానొక దశలో వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో ఉన్న జట్టును ఫించ్ 50 పరుగులు చేసి ఆదుకున్నాడు. అలాగే చివరి ఓవర్లలో బ్రావో 10 బంతుల్లో 20 పరుగులు చేయడంతో కనీసం ఆ మాత్రం స్కోర్ నైనా నమోదు చేయగలిగింది. ఈ సీజన్లో వరుసగా విఫలమైన కెప్టెన్ సురేశ్ రైనా ఈ మ్యాచ్ లోనూ 1 పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు.

ఇక, లక్ష్య చేధనలో రెండవ ఓవర్ నుండి ప్రారంభమైన వికెట్ల పతనం ప్రతి 4 ఓవర్లకు ఒక వికెట్ ను కోల్పోతూ సాగింది. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా మ్యాచ్ ను గుజరాత్ చేతికి చిక్కకుండా కెప్టెన్ వార్నర్ అడ్డుపడ్డాడు. కేవలం 58 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 అజేయమైన పరుగులు చేసి హైదరాబాద్ ను ఫైనల్లో నిలబెట్టాడు. వార్నర్ తర్వాత అత్యధిక స్కోర్ ను 8వ బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగిన బౌలర్ బిపుల్ శర్మ 11 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టి 27 పరుగులు సాధించాడు. ఇక, ప్రధాన బ్యాట్స్ మెన్లంతా పట్టుమని 10 పరుగులు కూడా చేయకుండానే వెనుతిరిగారు.

హైదరాబాద్ ఫైనల్లోకి ప్రవేశించడంతో రెండు పోటాపోటీ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్లో ఫుల్ ఫాంలో ఉన్న కెప్టెన్లు ఇద్దరూ విరాట్ కోహ్లి వర్సెస్ డేవిడ్ వార్నర్ గా సాగనుంది. ఎలాంటి పరిస్థితులలో అయినా మ్యాచ్ ను ఒంటి చేత్తో తన వైపుకు తిప్పగల ప్రతిభావంతులు కావడంతో… ఆదివారం నాడు జరగనున్న ఫైనల్ వీక్షకులకు ఫుల్ ‘కిక్’ను పంచుతుందని అంతా ఆశిస్తున్నారు.