YSRCP-TDP-MLA-Jaleel-Khan-Interviewవైఎస్సార్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యేల జంపింగ్ ఇప్పట్లో ఆగే అంశం కాదు అన్న విషయం స్పష్టమైంది. దీనికి తొలి బీజం వేసింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్న విషయం తెలిసిందే. దీంతో “తన బోణీ బాగుందని చంద్రబాబు కూడా ప్రశంసించారని, దాదాపు 40 మంది ఎమ్మెల్యేల దాకా టీడీపీలో చేరుతారని, అసలు వైకాపాను బొక్క పెట్టింది తానేనని” జలీల్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

విజయవాడలోని గొల్లపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ నేత బొమ్మసాని సుబ్బారావుతో పాటు వేలాది మంది కార్యకర్తలను టిడిపిలో చేర్చుకున్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి. ప్రత్యేకహోదాపై ఆందోళన చేద్దామంటే జగన్ ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డ జలీల్ ఖాన్, అసలు జగన్‌కు రాజకీయాల్లో ఏబీసీడీలు కూడా తెలియవని, త్వరలో జగన్ బంధువు, రాయచోటి వైఎస్‌ఆర్సీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారని సంచలన వ్యాఖ్య చేసారు.

అయితే జలీల్ ఖాన్ వ్యాఖ్యలపై వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పదవుల కోసం గడ్డి తినే రకం కాదని, పదవుల కోసం తాను పార్టీ మారనని, క్లిష్ట సమయంలోనే మన క్యారెక్టర్ బయట పడుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారనని, జగన్ తోనే నడుస్తానని సమాధానమిచ్చారు. అయితే ఇంతకు ముందు పార్టీ మారిన వారు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం, తర్వాత టిడిపిలోకి జంప్ కావడం చూస్తూనే ఉన్నాం. బహుశా జగన్ కు బంధువు కావడంతో శ్రీకాంత్ రెడ్డి వ్యవహారం క్లిష్ట స్థాయికి చేరుకోకపోవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గలు.