income taxగుట్టు చప్పుడు కాకుండా ఆదాయాన్ని దాచేస్తూ ప్రభుత్వానికి పన్నును ఎగవేస్తున్న అక్రమార్కులకు ఇక పట్టపగలే చుక్కలు చూపించే చర్యలకు రంగం సిద్ధమవుతోంది. పన్ను ఎగవేతలకు చెక్ పెట్టేందుకు ఆదాయ పన్ను శాఖ కొత్తగా ‘నేమ్ అండ్ షేమ్’ అస్త్రాన్ని బయటకు వదలనుంది. సరికొత్తగా రూపొందించిన ఈ పథకం కింద 1 కోటి అంతకంటే ఎక్కువ పన్నును ఎగవేసే వ్యక్తుల పేర్లను ఆదాయ పన్ను శాఖ ప్రముఖ దిన పత్రికల్లో ప్రచురించనుంది.

సదరు వ్యక్తుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు, పాన్ నెంబర్లతో సహా మొత్త వివరాలను పత్రికల్లో ప్రకటించడం ద్వారా వారికి సమాజంలో విలువ లేకుండా చేయడమే లక్ష్యంగా ఆదాయపన్ను శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ దిశగా పనిని ప్రారంభించిన ఆదాయపన్ను శాఖ… గతేడాది నుంచి ఇప్పటిదాకా 67 మంది పేర్లను బయటపెట్టింది. దీంతో నల్లధనం దాచుకున్న కుబేరుల్లో వణుకు మొదలైంది.

తొలుత 20 నుంచి 30 కోట్ల పన్నును ఎగవేసిన వారి పేర్లనే బయట పెట్టాలని భావించిన ఆ శాఖ తాజాగా 1 కోటి పన్నును ఎగవేసిన వారి పేర్లను కూడా బహిర్గతం చేయాలని నిర్ణయించింది. తాము పన్ను ఎగవేస్తున్నట్లు సమాజానికి తెలిసిపోయిందన్న భావనతో అయినా వారు ప్రభుత్వానికి బకాయిలు చెల్లిస్తారని ఆ శాఖ అంచనా వేస్తోంది. మరి ఈ శాఖ కొత్త ప్రణాళిక ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి.