Hero nani trying for stardom“భలే భలే మగాడివోయ్” వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యువ హీరో నాని నటించిన చిత్రం “కృష్ణగాడి వీరప్రేమగాధ” మరో రెండు రోజుల్లో ధియేటర్లలో ప్రత్యక్షం కానుంది. గత చిత్రం ద్వారా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించుకున్న నానికి, ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తే, ‘స్టార్ డం’ స్టేటస్ నాని సొంతమయ్యే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ సినిమాకు ఇప్పటివరకు ‘నెగటివ్’ టాక్ అన్నది లేకుండా విడుదల కానుండడం అతి పెద్ద ప్లస్ పాయింట్. ఆడియో విడుదల సందర్భంగా ప్రేక్షకులను పలకరించిన ధియేటిరికల్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన రావడం, దానికి తగిన విధంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశించిన స్థాయి కంటే రెట్టింపుగా మరియు సెన్సార్ నుండి ‘సూపర్’ అనే టాక్ ను సొంతం చేసుకోవడం, అడ్వాన్సు బుకింగ్స్ ఊపందుకోవడం వంటివి ఒక నాని సినిమాకు ఊహించనవి. కానీ అవన్నీ సాధ్యపడుతున్నాయంటే హీరోగా నాని దశ తిరిగినట్లే భావించవచ్చా? అది సినిమా ఫలితమే నిర్ధేశించనుంది. అయితే దానికి సానుకూల వాతావరణం మాత్రం ఏర్పడిందన్నది కాదనలేని సత్యం.

లోకల్ మార్కెట్ తో పాటు యుఎస్ మార్కెట్ కూడా ప్రస్తుతం తెలుగు సినిమాలకు ప్రామాణికంగా మారింది. అందులోనూ నాని గత చిత్రం “భలే భలే మగాడివోయ్” సినిమా యుఎస్ లో భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ సాధించలేని కలెక్షన్స్ ను నాని అవలీలగా సాధించడంతో, “కృష్ణగాడి వీరప్రేమగాధ”పై యుఎస్ మార్కెట్ లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఒకవేళ మరోసారి నాని ఇక్కడ సత్తా చూపితే చెర్రీకి సాధ్యం కాని ఓవర్సీస్ “స్టార్” ఇమేజ్ నాని సొంతమవుతుందని ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు.

దానికి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను నిర్మాతలైన 14 రీల్స్ సంస్థ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వినూత్న ప్రచారంలో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిన నిర్మాతలు, ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావడానికి బాటలు వేసారు. ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై, భారీ విజయం సాధించడమే తరువాయి..!