hari krishna nagendra babu joining in YSRCPగత పది, పదిహేను రోజులలో రెండు ప్రముఖ వార్తలు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అందులో ఒకటి… నందమూరి హరికృష్ణ వైసీపీలో చేరుతున్నారని… మరొకటి… మెగా బ్రదర్ నాగబాబు జగన్ పక్షాన నిలబడుతున్నారని..! ఈ రెండు వార్తలలోనూ జగన్ మరియు పార్టీ అన్నది మాత్రం కామన్ పాయింట్.

ఏ ఇతర పార్టీ మీద కాకుండా ఒక్క జగన్ చుట్టూనే ఈ వార్తలు ప్రభావితం చేయడం వెనుక వైసీపీ అధినేత వ్యూహం ఉందా? లేక వర్తమాన సినీ రాజకీయ పరిణామాలు ఈ విధమైన వార్తలకు ఊతమిస్తున్నాయా? ఏదైమైనా “నిప్పు లేనిదే పొగ రాదుగా” అన్న చందంగా టాలీవుడ్ ప్రముఖ సినీ సెలబ్రిటీల పట్ల జగన్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

దానికి ప్రత్యక్ష ఉదాహరణే… స్వయంగా దాసరి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం అని గుర్తు చేస్తున్నారు. దాసరి వంటి ప్రముఖులతో పాటు టాలీవుడ్ లో అగ్ర కుటుంబాలుగా వెలుగొందుతున్న నందమూరి, కొణిదల, ఘట్టమనేని, అక్కినేని కుటుంబాల నుండి కొందరిని తన పార్టీలోకి తెచ్చుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఈ నాలుగు కుటుంబాలలో ఘట్టమనేని కుటుంబం నుండి కృష్ణ సోదరుడు, మహేష్ బాబాయ్ ఆదిశేషగిరిరావు ఇప్పటికే జగన్ పార్టీలో ఉన్నారు. అలాగే అక్కినేని కుటుంబం ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. దీంతో అక్కినేని వారి సహకారం కోసం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన పనిలేదు.

ఇక, మిగిలిన రెండు కుటుంబాలలో ఒకటైన నందమూరి కుటుంబం తెలుగుదేశం పార్టీకే అంకితమైంది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో మరియు తనకు పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యత విషయంలో అసంతృప్తిగా ఉన్న హరికృష్ణ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో… హరికృష్ణకు కావాల్సినంత సహకారం అందించి పార్టీలోకి తెచ్చుకోవడం ద్వారా హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అలాగే, ఆ సామాజిక వర్గపు బలాన్ని పెంచుకున్నట్లు అవుతుందని జగన్ భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల టాక్.

అలాగే మెగా కుటుంబంలో ఉన్న ముగ్గురు బ్రదర్స్ లో ఇద్దరు ఇప్పటికే వేర్వేరు పార్టీలో ఉన్నారు. దీంతో మూడో బ్రదర్ పై జగన్ వేసిన స్కెచ్ సానుకూల ఫలితాన్ని ఇస్తే… మెగా వర్గపు ఓటింగ్ లో చీలిక రావడం తథ్యంగా భావిస్తున్న జగన్, ఈ సామజిక వర్గపు ఓట్లను కూడా ప్రభావితం చేయవచ్చని అనుకుంటున్నట్లుగా టాక్. ఉన్న ముగ్గురు మెగా సోదరులలో ఆర్ధికంగా నాగబాబు చాలా వెనుకబడి ఉండడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది.

మరో గమనించదగ్గ విషయమేమిటంటే… జగన్ ఫోకస్ చేస్తున్నట్లుగా లేదా జగన్ వైపుకు చూస్తున్న వారని చెబుతున్న పేర్లన్నీ దిగువ స్థాయి వారివే కావడం. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నందమూరి హరికృష్ణ, కొణిదల నాగబాబు… ఇలా అంతా కూడా సినీ ప్రేక్షకులతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకున్నవారు కాకపోవడం విశేషం. నిజానికి వైసీపీకి నేతల కొరతతో పాటు “క్రౌడ్ పుల్లర్స్” ఆవశ్యకత కూడా ఉంది. బహుశా అందుకే సినీ సెలబ్రిటీలపై ఫోకస్ చేస్తున్నారేమోనన్న భావనలు కూడా వినపడుతున్నాయి. మరి జగన్ స్కెచ్ ఏ మేరకు లాభిస్తుందో..? అసలు సఫలీకృతం అవుతుందో లేదోనన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో కాదు, టాలీవుడ్ లో కూడా ఆసక్తికరంగా మారింది.