Krish still working: It's not final with Balayya!ఇటీవలే పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైన నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం “గౌతమీపుత్ర శాతకర్ణి” విడుదల తేదీ కూడా బయటకు వచ్చేసింది. మే 9 నుండి సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాను 2017 సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇంకా షూటింగ్ ప్రారంభం కాని ఈ సినిమా విడుదల ఫిక్స్ కావడం పట్ల అభిమానులు మిక్కిలి సంతోషంతో ఉన్నారు.

ముఖ్యంగా బాలయ్యకు బాగా అచ్చివచ్చిన సంక్రాంతి పండుగకు 100వ సినిమాను తీసుకురావడం సెంటిమెంట్ గా కూడా అభిమానులకు పాజిటివ్ సంకేతాలను ఇస్తోంది. మే 9 మొదలుకుని నిరంతరాయంగా షూటింగ్ జరిపేందుకు బాలయ్య బాబు డేట్స్ ఇచ్చారని, దాదాపు ఆరు మాసాలలో షూటింగ్ పూర్తయ్యే విధంగా పక్కా ప్లానింగ్ తో సినిమా పూర్తి కానుందని, షూటింగ్ ఒక దశకు చేరుకున్న తర్వాత గ్రాఫిక్స్ వర్క్ కూడా జరిపేందుకు దర్శకుడు క్రిష్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో ‘బాహుబలి’ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా సినిమాను తెరకేక్కిస్తానని క్రిష్ ఇప్పటికే స్పష్టం చేయడంతో నందమూరి అభిమానులు 100వ సినిమా విజయంపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ చారిత్రాత్మక చిత్రంలో నటించేందుకు బాలయ్య మంచి ఉత్సాహంలో ఉండడంతో… తెలుగు చిత్ర సీమలో సువర్ణాక్షరాలతో లిఖించే చిత్రంగా నిలబడాలని ఆశిద్దాం.