erraballi-dayakar raowants tdp merger into trsతెలంగాణాలో తెలుగుదేశం పార్టీని వీడిన వారి మాటలను పరిశీలిస్తే… ఇది ఒక పార్టీ కాదు, కేవలం 10 మంది సభ్యులు నడుపుకునే సంస్థ మాదిరి అభిప్రాయ పడుతుండడం విశేషం. కొత్తగా ‘గులాభీ’ కండువా కప్పుకున్న ఎర్రబెల్లికి తెలంగాణాలో తెలుదేశం పార్టీ అంటే ఆయనోక్కరే అనుకుంటున్నారో లేక టీఆర్ఎస్ లో చేరిన 10 మంది సభ్యులు మాత్రమే అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి.

టిడిపి నుండి గత అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 15 మంది నేతలు ప్రజల ద్వారా ప్రజప్రతినిధులయ్యారు. అయితే వారిలో 10 మంది సభ్యులు అభివృద్ధి అని పేరు చెప్పి కొందరు, కార్యకర్తల సూచన అని మరికొందరు… ఇలా రకరకాల కారణాలు చెప్పుకుని “కారు” ఎక్కారు. మొన్నటి దాక ఇలా పార్టీలు ఫిరాయించిన వారిపై మండిపడ్డ ఎర్రబెల్లి దయాకరరావు గారు ఇప్పుడు తాను పార్టీ ఫిరాయించిన తదనంతరం మాత్రం, తనతో పాటు తెలుగుదేశం పార్టీకే ‘పసుపు’ కండువా తీసి ‘గులాభీ’ కండువా కప్పాలి అని ప్రయత్నిస్తున్నారు.

దీనికి సంబంధించి తాజాగా స్పీకర్ కు ఓ లేఖ కూడా రాసారు. 2/3వ వంతు సభ్యులు మాతోనే ఉన్నారు కాబట్టి, అసలు తెలుగుదేశం పార్టీ మాదే, మమ్ములనే తెలుగుదేశం పార్టీ సభ్యులుగా గుర్తించి టి-టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేయమని ఎర్రబెల్లి తెలంగాణా స్పీకర్ గారికి లేఖ సంధించారు. దీనిపై స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది పక్కన పెడితే ఎర్రబెల్లి వాదన వింత పోకడలను తలపిస్తోందని టిడిపి వర్గీయులు మండిపడుతున్నారు.

ఎర్రబెల్లి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో గానీ, ఒకవేళ ఆయన పార్టీ మారకపోయినట్లయితే ఈ వాదనను ఎవరైనా తెరపైకి తీసుకువస్తే సమర్ధిస్తారా? ఈ విధంగా కొద్దిమంది అభిపాయలు మార్చుకుని పార్టీని వీడిపోతే విలీనం చేయడానికో, మూసివేయడానికో ఇది ఒక ‘సంస్థ’ కాదు, అశేష ప్రజల మద్ధతు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్న ఒక రాజకీయ పార్టీ అని టి-టిడిపి వర్గీయులు విమర్శిస్తున్నారు.

వర్తమాన రాజకీయాలలో పార్టీ మార్పులు సహజమే. ఇలా పార్టీ మారిన ప్రతి నాయకుడు వారిని నమ్మి ఓటు వేసిన ప్రజల అభిప్రాయలను తెలుసుకుంటున్నారా? ఒకవేళ మళ్ళీ గెలిపిస్తే, అదే పార్టీలో చివరకు ఉంటామనే గ్యారెంటీ ప్రజలకు ఇవ్వగలరా? ఇచ్చినా ప్రజలు విశ్వసించగలరా?