dhoni 23 runs in last overs Rising Pune Supergiants beat Kings XI Punjab2016 సీజన్లో తమ చివరి మ్యాచ్ ఆడుతున్న పంజాబ్, పూణే జట్ల మధ్య మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆమ్లా 30, మురళీ విజయ్ 59 పరుగులతో సత్తా చాటగా, గుర్కీరత్ సింగ్ 30 బంతుల్లోనే 51 పరుగులు చేయడంతో స్కోర్ బోర్డు పరుగులెత్తింది. ఒకానొక దశలో భారీ స్కోర్ సాధిస్తుందనుకున్న పంజాబ్ జట్టును నిలువరించడంలో పూణే బౌలర్లు సఫలమయ్యారు.

లక్ష్య చేధనలో ఓపెనర్లు రేహనే 19, ఖ్వాజా 30 పరుగులు చేయగా, ఒత్తిడిలో చేతులెత్తేసిన ఇతర బ్యాట్స్ మెన్లు స్వల్ప స్కోర్ కే వెనుదిరిగారు. అయితే జట్టును గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్న కెప్టెన్ ధోని ఈ మ్యాచ్ లో పర్వాలేదనిపించే విధంగా రాణించాడు. చివరి ఓవర్ చేరుకునే సమయానికి 23 పరుగులు చేయాల్సి ఉండగా, మ్యాచ్ దాదాపుగా పంజాబ్ దే అన్న విషయం ఖరారైంది. ఇటీవల కాలంలో ధోని బ్యాటింగ్ అంతంత మాత్రంగానే ఉండడంతో పంజాబ్ జట్టు బౌలర్లు కూడా పూర్తి నమ్మకంతో ఉంది.

దీంతో స్పిన్నర్ పటేల్ రంగంలోకి దిగగా, మొదటి బంతికి ఒక్క పరుగు కూడా తీయలేదు. ఆ మరుసటి బంతి వైడ్ బాల్ కాగా, రెండవ బంతిని సిక్స్ గా మలిచాడు ధోని. అయితే మూడవ బంతికి ఎలాంటి పరుగు లభించకపోవడంతో, చివరి మూడు బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. ఈ తరుణంలో నాలుగవ బంతిని బౌండరీకి, చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి మ్యాచ్ ను విజయ తీరాలకు చేర్చాడు. చాలా కాలం తర్వాత ధోని బ్యాట్ జులిపించడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు.