Dasari-Narayana-Rao-Chiranjeeviటాలీవుడ్ కు పెద్ద దిక్కుగా ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే పేరు దర్శకరత్న దాసరి. అలాంటి పెద్ద దిక్కు ఇటీవల సంచలన వ్యాఖ్యలకు కేంద్రంగా నిలుస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి, పెద్ద సినిమాల ఆధిపత్యాలపై దాసరి చేస్తున్న వ్యాఖ్యలు ఎప్పుడూ మీడియా వర్గాలలో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా అదే బాటను అనుసరించబోతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం 1000 థియేటర్లలో రిలీజ్ చేయగల సినిమాలు లేవని, కేవలం 700 థియేటర్లకే తెలుగు సినిమాలు పరిమితమని వెల్లడించిన దాసరి, ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో చెబుతున్న లెక్కలన్నీ అవాస్తవాలని అన్నారు. ఒక సినిమా కలెక్షన్స్ పై ఏ నిర్మాత కూడా అధికారికంగా చెప్పలేదని, ఇవన్నీ కేవలం మీడియా సృష్టేనని, వాపును చూసి బలం అనుకోకూడదని హెచ్చరించారు.

గతంలో కూడా ఓ సారి దాసరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ సినిమా ‘బ్రూస్ లీ’ విడుదల సమయంలో దాసరి చేసిన వ్యాఖ్యలు సంచలనం కాగా, తాజాగా ‘సరైనోడు’ సినిమా ధియేటర్లలో ఉన్న సమయంలో దాసరి మరోసారి స్పందించడం విశేషం. ఈ సందర్భంగా చిరంజీవిపై కూడా స్పందించిన దాసరి… తనకు, చిరంజీవికీ మధ్య వివాదాన్ని మీడియా సృష్టిస్తోందని, సందర్భానుసారం కొన్ని కామెంట్లు వస్తుంటాయని, వాటిని మీడియా అతిగా చూపిస్తుందని, చిరంజీవి తనకు దగ్గరి బంధువని, తమ మధ్య అగాధాలు లేవని వివాదాలకు శుభంకార్డు వేసే ప్రయత్నం చేసారు.