chandrababu-naidu-YSRCP-MLAs-TDP-partyవైసీపీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి (కర్నూలు జిల్లా శ్రీశైలం), కిడారి సర్వేశ్వరరావు (విశాఖ జిల్లా అరకు) టీడీపీలో చేరిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనలు ఆసక్తికరమైన చర్చకు దారి తీసాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 175 అసెంబ్లీ సీట్లు ఉండగా, కొత్తగా మరో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు అందుబాటులోకి రానున్నాయని, మొత్తం సంఖ్య 225కు చేరుకుంటుందన్న ప్రచారాన్ని తెరదించుతూ, స్పష్టమైన ప్రకటన చేసారు.

రాష్ట్రంలో కొత్తగా 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయని, ఒక్క కర్నూలు జిల్లాలోనే 4 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయని చంద్రబాబు స్పష్టం చేసారు. దీంతో ఇప్పటికే పార్టీలో ఉన్న కీలక నేతలతో పాటు కొత్తగా పార్టీలోకి చేరుతున్న వారికి సీట్ల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవని చెప్పారు. అంటే అధికార పార్టీ టార్గెట్ 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అన్న కొత్త ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.

ఇప్పటివరకు 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం బాట పట్టగా, మరో 34 మంది వరకు సైకిల్ ఎక్కడానికి ఆస్కారం ఉందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే కొన్ని జిల్లాలలో బద్ధ శత్రువులుగా ఉన్న నాయకులు కూడా కలిసిపోవడానికి ఇదే ప్రధాన కారణంగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త అసెంబ్లీ స్థానాలకు అధికార పార్టీకి రెడీమేడ్ గా నాయకులు అందుబాటులో ఉండే అవకాశం ఉండనుండగా, ప్రతిపక్ష పార్టీకి మాత్రం నేతల కొరత ఏర్పడే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. అపర చాణక్యుడిగా పేరు గాంచిన చంద్రబాబు ‘స్కెచ్’ కూడా ఇదేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.