Naidu's Power Punch to reluctant employeesఅమరావతికి తరలి రావడంపై సచివాలయం ఉద్యోగులు ప్రవర్తిస్తున్న తీరు చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా హైదరాబాద్ నుండి కాకుండా అమరావతి నుండి పాలన చేయాలని సంకల్పించిన చంద్రబాబు, ఎలాగైనా జూన్ చివరి నాటికి ఉద్యోగులంతా రావాల్సిందే అంటూ గతంలోనే ఆదేశాలు జారీ చేసారు. అయితే పూటకో మాట చెప్తూ… కాలయాపన చేయడం ఉద్యోగుల వంతవుతోంది. కాసేపు వెళ్ళడానికి తమకేమి అభ్యంతరాలు లేవని, మరికాసేపు సౌకర్యాలు లేనటువంటి అమరావతికి తాము ఇప్పట్లో వెళ్ళడం అసాధ్యమని… ఇలా ఓ పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తుండగా, మరో పక్క రాష్ట్ర ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు.

అమరావతికి విచ్చేయడం ఇష్టం లేక చాలా మంది వాలెంటరీ రిటైర్మెంట్ కోసం దాఖలు చేసుకోవడం వారి ఆలోచనలకు అద్దం పడుతోంది. ఈ అతిరధ మహారధుల ఉద్యోగులే ఆనాడు సీమాంధ్ర ప్రయోజనాల కోసం ‘సమైక్య’ పోరాటం చేసింది… అంటే హాస్యాస్పదంగా ఉండడం సహజమే. అయితే ‘ఆడింది ఆట, పాడింది పాట’ మాదిరి ఉద్యోగులంతా ప్రవర్తిస్తుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేస్తున్నట్లు? సిఎం హోదాలో ఇచ్చిన ఆదేశాలు ఎంతవరకు అమలు అవుతున్నట్లు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అయితే, చంద్రబాబు మాత్రం ఉద్యోగుల విషయం తాను ఇవ్వాల్సిన స్వాతంత్ర్యం కంటే చాలా ఎక్కువ ఇస్తున్నారని అధికార వర్గీయులే పేర్కొంటున్నారు. అంతకు ముందు తొమ్మిది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత మరో పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి ఉద్యోగుల ఓట్లు కూడా చాలా కీలక పాత్ర పోషించాయి. దీంతో ఉద్యోగులను ఎక్కువగా ఇబ్బంది పెట్టని ప్రభుత్వాలు రెండో సారి కూడా అధికారంలోకి వస్తుండడంతో… గత 9 ఏళ్ళల్లో జూలు విదిల్చిన మునుపటి చంద్రబాబు, ప్రస్తుతం అస్సలు తారసపడడం లేదు.

పైగా ఉద్యోగులను బ్రతిమలాడుకోవడం ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు వంతు వచ్చింది. ఇప్పటికే చాలా సందర్భాలలో ఉద్యోగుల అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు, ఇటీవల కూడా ఈ విషయం స్పందిస్తూ… “ఉద్యోగులంతా త్యాగాలకు సిద్ధం కావాల్సిందే” అంటూ పిలుపునిచ్చారు. ఇంతకీ… ఉద్యోగులు ఏం త్యాగం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకైతే అంతు పట్టడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండడం ఎంత వరకు సమంజసం? 43 శాతం ఫిట్ మెంట్, వారానికి 5 రోజుల పాటు పనిదినాలు, వీటితో పాటు ఉద్యోగ సంఘాలు కోరే బస్ పాస్ మరియు ఇతర గొంతెమ్మ కోర్కెలకు చంద్రబాబు సర్కార్ తల ఊపడం చూస్తుంటే… నిజంగా వారు త్యాగాలు చేస్తున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తే… అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నది చంద్రబాబేనా? లేక మరొకరు ఎవరైనా ఉన్నారా? అన్న అనుమానాలు రాష్ట్ర ప్రజలకు కలుగుతున్నాయి.

ఉద్యోగులు అడిగినవన్నీ ఇస్తూ కూడా త్యాగాలు చేయాలని చెప్పడం చంద్రబాబుకైనా తగునా? ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి ఒక ముఖ్యమంత్రి ఇంతగా కష్టపడాలా? ఎందుకు ఇంతగా వారిని ప్రాధేయపడడం? అన్న ప్రశ్నలు చంద్రబాబు వైపుకు చూపిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే… రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఒక ముఖ్యమంత్రి అదే వసతులు లేని ప్రాంతానికి ఏడాదిన్నర్ర క్రితమే విచ్చేస్తే, మరి ఉద్యోగులు రావడానికి ఎందుకు సంశయిస్తున్నారు? ముఖ్యమంత్రి హోదా కంటే ఉద్యోగుల హోదానే ఎక్కువా? సిఎం ఆదేశాలను సైతం బేఖాతరు చేసే విధంగా డిమాండ్లు చేయడం అనేది ఎవరు ప్రేరేపిస్తున్నారు? అన్న ప్రశ్నలు ఉద్యోగుల వైపు చూపిస్తున్నాయి. చివరికి ముఖ్యమంత్రి, ఉద్యోగులు ఏం చేస్తారో గానీ, సమయం మాత్రం ముంచుకొస్తోంది.