Chandrababu effect on Railway zone and special statusఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రితో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహాయం, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల మంజూరుతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న వివిధ ప్రాజెక్టుల విషయమై చర్చలు జరిపి, కేంద్రం సహాయ సహకారాలు కోరిన విషయం తెలిసిందే.

అయితే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం, కేంద్రం నుండి అంతంత మాత్రపు స్పందన రావడం ఇవన్నీ ఎప్పుడూ రొటీన్ గా జరుగుతున్నవే. దీంతో ఈ సారి బాబు పర్యటనకు మీడియా వర్గాలు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. బహుశా ఇదే బాబుకు అనుకూలంగా మారిందేమో గానీ, రెండు ప్రధాన అంశాలపై కేంద్రం సానుకూల వ్యవహారశైలి వ్యక్తపరచడం విశేషం.

ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, ప్రధాని నోటి నుంచి ఏపీకి “ప్రత్యేక హోదా” మాటను ఆయన వినిపించలేకపోయిన చంద్రబాబు, తాజాగా జరిగిన భేటీలో మాత్రం మోడీ నోట “ప్రత్యేక హోదా” మాటను రాబట్టగలిగారు. “ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా ఆదుకుంటాం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి నీతి ఆయోగ్ నుంచి నివేదిక కూడా అందింది. దానిని ఎలా అమలు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. తప్పకుండా త్వరలోనే శుభవార్త వింటారు” అని మోడీ చెప్పడంతో ప్రత్యేక హోదా ఆశావాహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

అలాగే, ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మరో అంశం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత తెలిపింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి రైల్వేశాఖకు ఆదేశాలు వెళ్లాయి. ఆ వెంటనే రైల్వే జోన్ పై చర్చించేందుకు రైల్వేశాఖ సాంకేతిక కమిటీ సమావేశమైంది. మిట్టల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జోన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే మంత్రివర్గ సమావేశానికి రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వనున్నారు. తాజా పరిణామాలతో ఏపీని కాస్త శాంతపరిచే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్లుగా కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.