Brahmotsavam-effect-employee-removedఒక ఆంగ్ల పత్రికలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాపై రాసిన ఆర్టికల్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. విమర్శలను మించిపోయే విధంగా ఉన్నటువంటి ఆ ఆర్టికల్ పై ప్రిన్స్ అభిమానులు మండిపడుతూ… మహేష్ బాబుపై అభిమానాన్ని కురిపిస్తూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తూ సందడి చేసారు. అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ ఆంగ్ల పత్రిక ఆఫీస్ కు వెళ్లి యాజమాన్యంతో చర్చలు జరిపారు.

బుధవారం నాటి సంచికలో ప్రధాన పేజీలో ‘క్షమాపణలు’తో కూడిన వార్తను కూడా ప్రచురితం చేస్తామని అభిమాన సంఘం తరపున హాజరైన దిడ్డి రాంబాబు తదితరులకు యాజమాన్యం హామీ ఇవ్వడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ శాంతించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం అభిమానుల ఆగ్రహం ఆగలేదు. మళ్ళీ ఇలాంటి కధనాలను ప్రచురితం చేస్తే సహించేది లేదని సోషల్ మీడియా వేదికగా ప్రిన్స్ అభిమానులు సదరు మీడియాపై మండిపడుతున్నారు.

చర్చలు అనంతరం మీడియా వర్గాలతో మాట్లాడిన దిడ్డి రాంబాబు తదితరులు… సదరు దినపత్రిక తదుపరి సంచికలో పూర్తి వివరణతో కూడిన ఆర్టికల్ ను ప్రచురిస్తామని హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. అలాగే ఇలాంటి మీడియా నైతిక విలువలు లేని కధనాలు ప్రచురించకుండా ఉండాలని కోరారు. వివాదాలకు దూరంగా ఉండే తమ హీరో పైన బురద జల్లడం సరైన ప్రక్రియ అనిపించుకోదని అన్నారు.

సోషల్ మీడియాలో హల్చల్ చేసేటటువంటి ఓ 5 శాతం అందరి హీరోల అభిమానులు కూడా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. తదుపరి సంచికలో వచ్చే ఆర్టికల్ ను చూసి దానిపై మరలా స్పందించాల్సి వస్తే… అప్పుడు మళ్ళీ మీడియాకు తెలియజేస్తామని అన్నారు. మొత్తమ్మీద మహేష్ ను టార్గెట్ చేస్తూ రాసిన ఒక ఆర్టికల్… మీడియా సంస్థనే ప్రశ్నించే విధంగా చేసింది.