bad-days-for-bangalore-royal-challengersరాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీం పరిస్థితి ఇది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అత్యుత్తమమైన క్రీడాకారులు ఉన్నా విజయాలు అందుకోవడంలో బొక్కా బోర్లా పడుతున్న వైనం బెంగుళూరు టీం అభిమానులను కలచి వేస్తోంది. 2016 సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ లలో కేవలం రెండు విజయాలను అందుకుని 4 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. బెంగుళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగిలిన 8 మ్యాచ్ లలో ఆరు విజయాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సిందే.

నిజానికి ఈ సీజన్లో బెంగుళూరు ఆడిన తొలి మ్యాచ్ తర్వాత 2016 ఐపీఎల్ ఈ జట్టుదేనని దాదాపుగా అంతా ఖరారైపోయారు. ఓపెనర్ గేల్ మొదలుకొని, విరాట్ కోహ్లి, డివిలియర్స్, వాట్సన్ వంటి హేమాహేమీల భయంకరమైన బ్యాటింగ్ లైనప్ మరే జట్టుకు లేకపోవడంతో బెంగుళూరు టీం ఓటమి పాలు కావడం అసాధ్యం అనుకున్నారంతా. అయితే ఇప్పటివరకు జరిగిన 8 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని బెంగుళూరు జట్టు, ఈ సారి కూడా అదే బాటలో పయనించడం విశేషం.

తాజాగా సన్ రైజర్స్ తో ఆడిన మ్యాచ్ లో 195 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. విరాట్ కోహ్లి 14 పరుగులకే అవుటైనా, మరో ఓపెనర్ రాహుల్ 28 బంతుల్లో 51 పరుగులు చేయగా, చెలరేగిపోతాడనుకున్న డివిలియర్స్ 32 బంతుల్లో 47 పరుగులు చేసాడు. ఇక వాట్సన్ 2 పరుగులకే అవుట్ కావడంతో భారీ లక్ష్యానికి మరో 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కెప్టెన్ వార్నర్ 50 బంతుల్లో 92 పరుగులతో వీరవిహారం చేయడంతో భారీ స్కోర్ ను అందుకోగలిగింది. ఈ సిరీస్ లో వరుసగా కెప్టెన్ ఇన్నింగ్స్ లు ఆడుతూ 386 పరుగులతో విరాట్ కోహ్లిని దాటి ‘ఆరంజ్’ క్యాప్ అందుకున్నాడు వార్నర్. ఈ గెలుపుతో ఆడిన 7 మ్యాచ్ లలో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి టాప్ 4లో స్థానం సంపాదించుకుంది. హైదరాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ ను తిలకించడానికి విక్టరీ వెంకటేష్ కొడుకుతో సహా హాజరు కాగా, అక్కినేని అఖిల్ కూడా వెంకీ పక్కనే దర్శనమిచ్చాడు