Sivaji Response Pawan Kalyan Public Meeting, Sivaji Response Pawan Kalyan Public Meeting Tirupati, Sivaji Response Pawan Kalyan Speech AP Special Statusతిరుపతి, ఇందిరా గ్రౌండ్ వేదికగా పవన్ చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో పెను చర్చలకు దారి తీసింది. నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ… రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటిస్తూ… ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ చేసిన ప్రసంగానికి రాజకీయ విశ్లేషకుల నుండి మంచి స్పందనలు వస్తున్నాయి. చాలా పరిపక్వత గల ప్రసంగం ఇచ్చారని, అలాగే ఇప్పటివరకు ప్రశ్నార్ధకంగా మారిన ‘జనసేన’ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి, తన రాజకీయ జీవితంపై స్పష్టత ఇచ్చారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ పోతోంది. ఓ వైపు సోషల్ మీడియాలో పవన్ మాటలకు మద్దతుగా ట్రెండ్స్ ప్రారంభం కాగా, మరో వైపు ఎలక్ట్రానిక్ మీడియాలో పవన్ ప్రసంగంపై విశ్లేషణలు జరుగుతున్నాయి. అలాంటి ఓ విశ్లేషణలో ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ అధ్యక్షుడు, గత కొన్ని నెలలుగా పవన్ బయటకు రావాలని కోరుతున్న నటుడు శివాజీ తన అభిప్రాయాన్ని తెలిపారు.

పవన్ కు మద్దతుగా నిలిచిన శివాజీ, ‘దయచేసి పవన్ కళ్యాణ్ ను విమర్శించకండి’ అంటూ పిలుపునిచ్చారు. ‘ఒక వ్యక్తి ఏదో మంచి చేయాలని వచ్చాడు, చేయనివ్వండి… ఒకవేళ ఈయన కూడా చేయకపోతే అప్పుడు తిడదాం… ఇప్పుడు కాదు…’ అంటూ రాజకీయ పార్టీలకు, పార్టీ నేతలను కోరారు. అలాగే ప్రజలంతా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచి, కొండంత అండగా ఉండాలని అన్నారు. పవన్ కోరితే ఎలాంటి సమయంలోనైనా తానూ ముందు ఉంటానని ‘ప్రత్యేక హోదా – ఏపీ హక్కు’ అంటూ నినదించారు.