AB de Villiers unbeaten 79 powers RCB into IPL 2016 finalsఅనుకున్నదంతా అవుతోంది… చరిత్ర పునరావృతమవుతోంది. గతేడాది ముంబై ఇండియన్స్ మాదిరే పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుండి రెండవ స్థానానికి ఎగబాకిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కూడా ఫైనల్లోకి దూసుకెళ్లి… ట్రోఫీ దక్కించుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. గుజరాత్ లయన్స్ తో తలపడ్డ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లి నమ్మకాన్ని బౌలర్లు వమ్ము చేయకుండా, రెండవ ఓవర్ నుండే వికెట్ల పతనానికి నాంది పలికారు.

9 పరుగులకే కెప్టెన్ రైనాతో సహా 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును డ్వేన్ స్మిత్ ఆదుకున్నాడు. దినేష్ కార్తీక్ (26) అండతో స్మిత్ (41 బంతుల్లో 73) పరుగులు చేసి గుజరాత్ గౌరవప్రదమైన స్కోర్ చేయడానికి కారణమయ్యాడు. స్మిత్ మినహా అంతా విఫలం కావడంతో 20 ఓవర్లలో కేవలం 158 పరుగులకు ఆలౌట్ అయ్యింది గుజరాత్. కోహ్లి సేన బ్యాటింగ్ లైనప్ కు ఈ స్కోర్ చిన్నబోయేలా ఉండడంతో, తేలికగా లక్ష్యాన్ని చేదిస్తుందనుకున్న ప్రేక్షకులకు గుజరాత్ బౌలర్లు షాక్ ఇచ్చారు.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు బ్యాట్స్ మెన్లను దావల్ కులకర్ణి తన బౌలింగ్ తో బెంబేలేత్తించాడు. ఈ ప్రభావంతో 29 పరుగులకే డివిలియర్స్ మినహా ప్రధాన బ్యాట్స్ మెన్ల 5 కీలక వికెట్లు కోల్పోయి, వీక్షకులను నిరాశ దిశగా తీసుకెళ్ళింది. అయితే క్రీజ్ లో ఇంకా డివిలియర్స్ ఉండడంతో… ఒక వైపు జట్టుకు, మరో వైపు ప్రేక్షకులకు బెంగుళూరుపై ఎక్కడో ఓ చిన్న ఆశ ఉంది. దానిని వమ్ము చేయకుండా ఒంటి చేత్తో జట్టును ఫైనల్లోకి చేర్చాడు డివిలియర్స్.

కాసేపు స్టువర్ట్ బిన్నీ (21) క్రీజులో ఉండగా, స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా (33 నాటౌట్) అండతో జట్టును ముందుండి నడిపించాడు ఏబీ. కేవలం 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపదడంతో ఓడిపోతుందనుకున్న బెంగుళూరు జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో అవాక్కయ్యే వంతు రైనాకు వచ్చింది. మ్యాచ్ ను గెలిపించిన వెంటనే బెంగుళూరు టీం మొత్తం డివిలియర్స్ పై పడిపోయి తన సంతోషాన్ని వెళ్ళగక్కారు. నేడు జరగనున్న కోల్ కతా వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో గెలుపొందిన జట్టుతో గుజరాత్ ఆడనుంది.