AP-Capital-Amaravati-narendra modi chandrababu naiduనవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించాల్సిన బాధ్యత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పై ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కేటాయించాల్సి ఉంటుంది. అయితే పరిణామాలు ఆ విధంగా జరుగుతున్నాయా? అంటే ఖచ్చితంగా కాదనే సమాధానమే వస్తుంది. ఆర్ధిక లోటుతో రాష్త్రం దీనంగా అర్ధిస్తున్నా కేంద్రం కనికరించడం లేదు. ఇలాంటి తరుణంలో అమరావతి నిర్మాణం అసలు ఏ విధంగా జరుగుతుంది? అన్న సాధారణ సందేహాలు సామాన్యులను తలచి వేస్తున్నాయి.

గత ఏడాదిన్నర్రగా జరగుతున్న పరిణామాలను చూసి… “ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు మాటలు చెప్పడంలో ఆరితేరిపోయారన్న” వాస్తవాన్ని ప్రజలు గమనించారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ కూడా తన ‘మాటల గారడీ’ని ప్రదర్శిస్తున్నారనేది విమర్శకుల వ్యాఖ్య. తను నిర్వర్తించాల్సిన బాధ్యతను సింగపూర్ ప్రధాని పై పెడుతూ మోడీ వ్యాఖ్య చేయడాన్ని ప్రధానంగా తప్పు పడుతున్నారు.

కోమల విలాస్‌లో ఏర్పాటుచేసిన విందు సమావేశంలో “అమరావతిని అత్యద్భుతంగా నిర్మించాలని సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌ను మోడీ కోరారని” భారత విదేశాంగశాఖ అధికారులు వికాస్‌ స్వరూప్‌, అనిల్‌ వాద్వా తెలిపారు. అలాగే అమరావతి శంకుస్థాపనకు వెళ్లిన విషయాన్నికూడా మోడీ గుర్తు చేసినట్లు తెలిపారు. ప్రతిగా “అదే సంకల్పంతో తాము కూడా పని చేస్తున్నట్టు సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌ అన్నట్టు” విదేశాంగశాఖ అధికారులు తెలిపారు.

దేశ ప్రధానిగా మోడీ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావు లేకపోయినప్పటికీ, ఏపీ ఉన్న ప్రత్యేక పరిస్తితుల దృష్ట్యా ప్రధానిగా తాను అందించాల్సిన సాయంలో అంతంత మాత్రం నిధులనే కేటాయిస్తున్న మోడీ, అమరావతిని అద్భుతంగా నిర్మించాలని సింగపూర్ ప్రధానిని కోరడం కేవలం రాష్ట్ర ప్రజలను బుట్టలో వేసుకోవడానికేనా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూడబోతుంటే… అమరావతి నిర్మాణానికి కూడా మోడీ చేతులేత్తేసినట్లే కనపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.