S Abdul Nazeer New Governor APరాష్ట్రాలకి గవర్నర్ల నియామకాలు, బదిలీలు సాధారణమే అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఆయా రాష్ట్రాలలో రాజకీయ అవసరాలు, ప్రాధాన్యతలు ఇంకా అనేక అంశాలని పరిగణనలోకి తీసుకొని నియమకాలు జరుగుతుంటాయి. ఉదాహరణకి తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కనుక తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ని తెలంగాణ గవర్నర్‌గా నియమించిన్నట్లు భావించవచ్చు. వారు కేంద్ర ప్రభుత్వ ప్రతిధులుగా వ్యవహరిస్తుంటారు కనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వారి ద్వారా రాష్ట్రాలలో రాజకీయాలను ప్రభావితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం సహజమే.

ఇంతకీ విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలో 13 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లని నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ని ఛత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌గా బదిలీ చేసి ఆయన స్థానంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ని నియమించింది.

కర్ణాటకకి చెందిన జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అయోద్య రామజన్మబూమి, ట్రిపుల్ తలఖ్, పెద్దనోట్ల రద్దు, ఆధార్ చట్టబద్దత తదితర కీలకమైన కేసులని విచారించిన ధర్మాసనాలలో సభ్యుడుగా ఉంటూ కేంద్ర ప్రభుత్వానికి ఉపశమనం కలిగించారు. మిగిలిన రాష్ట్రాల గవర్నర్ల నియామకాలు, బదిలీలని పక్కనపెడితే ఏపీ గవర్నర్‌ని ఎందుకు బదిలీ చేసిందనే సందేహం కలుగుతోంది.

ఎందుకంటే ఆయనకి, వైసీపీ ప్రభుత్వానికి మద్య ఎటువంటి విరోదమూ లేదు. కనుక ఎటువంటి పిర్యాదులు లేవు. వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేదు. కనుక బిశ్వభూషణ్‌ని ఛత్తీస్‌ఘడ్‌కి బదిలీ చేసే బదులు జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్నే ఆ రాష్ట్ర గవర్నర్‌గా నియమించవచ్చు. కానీ ఏపీ గవర్నర్‌గా నియమించడం వెనుక అర్దం ఏమిటి? ఆయన నియామకంతో వైసీపీ, జనసేనలలో దేనికి మేలు చేకూరబోతోంది?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీలో ఆర్ధిక సంక్షోభంతో పాటు రాజకీయ, న్యాయ సంక్షోభం కూడా తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుకనే జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ని నియమించి ఉండవచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కానీ సాధారణ ప్రక్రియలో భాగంగానే ఏపీకి కొత్త గవర్నర్‌ నియామకం జరిగి ఉండవచ్చని అధికార వైసీపీ భావిస్తోంది.

ఏపీ ప్రభుత్వం త్వరలో మళ్ళీ మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పుతున్నప్పుడు, కేంద్రం ఏపీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ని నియమించడం యాదృచ్చికమని అనుకోలేము. కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానికే కట్టుబడి ఉందని రాష్ట్ర బిజెపి నేతలు పదేపదే చెపుతున్నారు. కనుక జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ నియామకం మూడు రాజధానుల ప్రక్రియని అడ్డుకొనేందుకే కావచ్చునేమో?