is-bhumana-karunakar-reddy-behind-tuni-kapu-violenceకాపు ఐక్యగర్జన అంటూ తుని వేదికగా ముద్రగడ చేసిన హడావుడిలో జగన్ అత్యంత సన్నిహితుడు, కుటుంబ సభ్యుడు అయిన ప్రముఖ వైసీపీ నేత కరుణాకరరెడ్డి పాత్ర ఉందని ఇటీవల పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. దీనిపై మరింత విచారణ జరుగుతుండగా, ఈ విధ్వంసంలో విజయవాడ – విశాఖల మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు జరిగిన నష్టం విలువను రైల్వే శాఖ అంచనా వేసింది.

మొత్తం 24 బోగీలకు నష్టం జరగగా, కొన్ని బోగీలు పూర్తిగా దగ్ధం కాగా, మరికొన్ని పాక్షికంగా దహనం అయ్యాయి. వీటి మొత్తం మరమ్మత్తులకు దాదాపు 8.29 కోట్లు ఖర్చు అవుతుందని రైల్వే శాఖ తేల్చింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ అడిగిన ఓ ప్రశ్నకు జవాబుగా రైల్వే మంత్రి జవాబిచ్చారు. దీంతో ఆ రోజు జరిగిన నష్టం విలువ బయటకు వచ్చినట్లయింది.

అయితే ఇది ఒక్క రైల్వే శాఖకు సంబంధించిన నష్టం మాత్రమే. ఇవి కాక, పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టిన ఘనులు, మరికొన్ని ప్రైవేటు ఆస్తులను కూడా ధ్వంసం చేసారు. ఇవన్నీ కూడితే ఒక్క రోజు రాజకీయం కోసం జరిగిన నష్టం దాదాపు రెండెంకల స్కోర్ ను దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఓ పక్కన రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో ఇలా స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమో సదరు రాజకీయ నేతలే పునరాలోచించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.