latest-survey-on-modi-governmentబిజెపిని అధికారంలో కూర్చోబెట్టిన నాటి నుండి నరేంద్ర మోడీ పాపులారిటీ అంతకంతకూ పెరుగుతూ పోయింది. అయితే కేంద్రంలో బిజెపిని గద్దెనెక్కించిన ప్రజలు మరో వైపు రాష్ట్రాలలో మాత్రం బిజెపి అంటే మొహం చాటేస్తున్నారు. వరుసగా వైఫల్యాలు చవిచూస్తున్న మోడీ సర్కార్ జాబితాలో ఉత్తరప్రదేశ్ కూడా చేరనుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

యూపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని ఏబీపీ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో వెల్లడైంది. మొత్తం 403 మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్రంలో బీఎస్పీ 31 శాతంతో 185 స్థానాలను గెలుచుకుని మళ్ళీ అధికార పీఠం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.

ఇక, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి సమాజ్ వాదీ పార్టీకి 30 శాతం ఓట్లు వచ్చి రెండవ స్థానానికి పరిమితం అవుతారని అంచనా వేయగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రం కేవలం 18 శాతం ఓట్లు వస్తాయని తమ సర్వేలో వెల్లడైనట్టు ఏబీపీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో నిరుద్యోగం, అవినీతి, పేదరికం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు ఫలితాలను శాసించనున్నాయని వెల్లడించింది.

2012లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ 80 స్థానాలకు పరిమితం కాగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ 228 స్థానాల్లో గెలవడంతో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన విషయం సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.., దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేంద్ర మోదీని అత్యుత్తమ నేతగా యూపీ ప్రజలు భావిస్తున్నారని, ఆపై మాయావతి, అఖిలేష్ లు వరుస క్రమంలో ఉన్నారని తెలిపింది.