J.-C.-Diwakar-Reddy-TDP-Party-Latest-Rumorsఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విలక్షణమైన నేత జేసీ దివాకరరెడ్డి. సొంత పార్టీ ఇబ్బంది పడినా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నేత ఆయన. కరడుగట్టిన కాంగ్రెస్ నేతగా పేరొందిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం ఆయన టీడీపీలో చేరారు. ఆ నాటి నుండి టీడీపీలో ఆయన గట్టిగా తన వాణి వినిపిస్తున్నారు. మా వాడు జగన్ అంటూనే ప్రతిపక్ష నేతకు చురకలు అంటించడం, చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయడం జేసీ తరచూ చేసే పనే. ఎన్నికల తరువాత కూడా ఆయన చంద్రబాబే ముఖ్యమంత్రి అని గట్టిగా చెబుతున్నారు.

పోలింగ్ తరువాత ఈ టాపిక్ పై మీడియా ముందు ఆయన మాట్లాడినన్ని సార్లు మారే ఇతర టీడీపీ నాయకుడు మాట్లాడి ఉండడు. వృద్ధులు, అమ్మవార్లు భారీ ఎత్తున తరలివచ్చి చంద్రబాబును దీవించారని దీనితో ఆయన విజయం ఖాయమని ఆయన చెబుతున్నారు. జగన్ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని ఈ సీనియర్ నేత గంటాపథంగా చెబుతున్నారు. అటువంటి జేసీపై ఎన్నికల ఫలితాలు కూడా రాకముందే పార్టీ మారతారనే వదంతులు వినిపిస్తున్నాయి.

టీడీపీ గెలుస్తుందని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా ఆయన ఇప్పటికే తన కుటుంబసభ్యులతో మాట్లాడారని టీడీపీ అధికారంలోకి రాని పక్షంలో తమ ప్రాంతంపై పట్టు నిలుపుకోవాలంటే పార్టీ మారక తప్పని పరిస్థితి అని వారికి ఆయన చెప్పారట. దీనికి వారంతా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఫలితాలు వచ్చిన అవి ప్రతికూలంగా ఉంటే వెంటనే మద్దతుదారుల మీటింగ్ పెట్టి వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారి ఉద్దేశమట. బహుశా రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు అనేదానికి ఇదే నిదర్శనం కావొచ్చు.